తెలంగాణ బాక్సింగ్ లీగ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్నేషనల్ బాక్సింగ్ లీగ్ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. గచ్చిబౌలి వేదికగా జరుగుతోన్న ఈ మెగా లీగ్ తొలి సీజన్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. నగరం తొలిసారి ఆతిథ్యమిస్తోన్న ఈ లీగ్ రెండు రోజుల పాటు జరుగనుంది. బాక్సింగ్ క్రీడకు ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో తెలంగాణ బాక్సింగ్ సంఘం లీగ్ నిర్వహణ బాధ్యతను భుజానికెత్తుకుంది. ఇందులో భారత్‌తో పాటు కజకిస్తాన్, అఫ్గానిస్తాన్, అర్మేనియా, కెన్యా, థాయ్‌లాండ్, ఇరాన్‌లకు చెందిన 14 మంది పురుష బాక్సర్లు, నలుగురు మహిళా బాక్సర్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. తొలి రోజు పోటీల్లో భారత బాక్సర్ ఆసిఫ్ అసద్ నాకౌట్ విజయంతో సత్తాచాటాడు.
కజకిస్తాన్‌కు చెందిన అస్కాన్పై ఆసిఫ్ గెలుపొందాడు. మరో బౌట్లో నికోలస్ వాంగపై ఆకాశ్ దీప్ సింగ్ గెలిచాడు. ఇతర బౌట్లలో పుష్కర్ భోస్లేపై నోర్బెర్టో టానో, విక్రమ్‌జీత్ సింగ్‌పై ఫిగరో మహేశ్ గెలిచారు. రూపిందర్ కౌర్, థిదరత్ యువాన్వాంగ్ల మధ్య జరిగిన పోరు డ్రా అయింది. పోటీల అనంతరం ప్రముఖ డ్రమ్ వాయిద్యకారుడు శివమణి తన బృందంతో కలిసి ప్రేక్షకులకు వినోదం పంచాడు. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ బాక్సింగ్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.