'జేఏసీ పుట్టకముందే తెలంగాణ ప్రకటన'
కరీంనగర్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై తెలంగాణ రాష్ర్ట ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జేఏసీ పుట్టకముందే తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిందని కరీంనగర్ లో సోమవారం మంత్రి ఈటల వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ ఎస్ కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకుందని అన్నారు. కోదండరాం అవాస్తవాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. కోదండరాం విమర్శల వెనక కుట్రలు, కుతంత్రాలు దాది ఉన్నాయా..? అంటూ ఈటల ప్రశ్నించారు.
మిషన్ కాకతీయ బాగుందని గతంలో చెప్పిన కోదండరాం.. ఇప్పుడు బాగా లేదనడంలో అర్ధమేమిటో చెప్పాలన్నారు. రాజకీయ పార్టీల కంటే భిన్నంగా కోదండరాం విమర్శలు చేస్తే ప్రజలు క్షమించరని చెప్పారు. మిషన్ కాకతీయ, రైతులకు పంట రుణాల మాఫీ, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్, కులవృత్తులకు మేలు చేసినట్లు కాదా..? అని మంత్రి ఈటల సూటిగా ప్రశ్నించారు.