ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దుతాం
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.లక్ష్మారెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగాన్ని అభివృద్ధి పరుస్తూ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. శని వారం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రి అవరణలో ఆస్పత్రి నూరేళ్ల పండుగ నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడారు. త్వరలో అన్ని జిల్లా ఆరోగ్య కేంద్రాల్లో వెంటిలేటర్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులతో చర్చలు జరుపుతామని ఆయన హామీ ఇచ్చారు. నిమ్స్ ఆస్పత్రిలోని జీవన్‌ధాన్‌లో అవకతవకలు జరుగుతున్నాయన్న ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు ఆరోపణలకు స్పందించిన మంత్రి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.
ఎయిమ్స్ కోసం కృషి చేస్తా: దత్తాత్రేయ
అనంతరం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ కేంద్ర మంత్రి లడ్డాతో మాట్లాడి తెలంగాణకు ఆలిండియా మెడికల్ సైన్స్(ఎయిమ్స్) వచ్చేలా తన వంతు కృషి చేస్తానన్నారు. అలాగే ఫీవర్ ఆస్పత్రి అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాస్తానని చెప్పారు. అంతేకాదు కేంద్రం నుంచి రూ. 15 కోట్లను ఆస్పత్రి అభివృద్ధి కోసం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే వైరాలజీ ల్యాబ్, ఐసోలేషన్ వార్డుల కోసం మరో రూ. మూడు కోట్లు కూడా మంజూరు చేయిస్తానన్నారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఫీవర్ ఆస్పత్రిలో వైరాలజీ ల్యాబ్ ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌రాజశేఖరరెడ్డి ఎంతో చొరవ చూపారన్నారు.
ఫీవర్ ఆస్పత్రిలో రోగుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆస్పత్రి నూరేళ్ల పండుగను పురస్కరించుకొని ఆస్పత్రి సిబ్బంది రూపొందించిన సావనీరును ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, డీఎంఈ డాక్టర్ రమణి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్, సీఎస్ ఆర్ఎంవో డాక్టర్ టి.చిత్రలేఖ, ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.ప్రభాకర్, తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.