మరిచిపోని ‘రక్తచరిత్ర’
సాక్షి, పరకాల: స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోరుతూ .. భుమి కోసం.. భుక్తి కోసం బానిస బంధాల విముక్తి కోసం పోరాడి ఎందరో ఉద్యమకారుల వీర మరణంతో 1947 సెప్టెంబర్ 2న పోరాటాల గడ్డ పరకాల నేల రక్తసిక్తమైంది. వందలాది మంది మంది క్షతగాత్రులయ్యారు. నెత్తుటి ముద్రల తాలుకు గుర్తులు ఇంకా ఉద్యమకారుల స్మతి పథం నుంచి ఇంకా చెరిగిపోలేదు. మరో జలియన్‌వాలా బాగ్గా తెలంగాణ సాయుధ పోరాటంలో చిరస్మరణీయంగా నిలిచింది. భారతదేశంలో జరిగిన పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందంటూ పరకాలలో జరిగిన పోరాటం చరిత్రకెక్కింది.
అమరవీరుల స్మారకార్థం..
1947 సెప్టెంబర్ 2న జరిగిన మరో జలియన్‌వాలాబాగ్ ఘటనను కళ్లకు కట్టినట్లు అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు తన తల్లి చంద్రమ్మ మెమోరియల్ ట్రస్టు తరఫున వందలాది విగ్రహాలతో పరకాల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీస్థలంలో రెండేళ్లుగా శ్రమించి 2003 సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం రోజున నిర్మాణం చేసిన అమరధామాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు ప్రస్తుతం పరకాల పట్టణంలో ఎలాంటి ఉద్యమ కార్యక్రమం జరిగిన ఇక్కడి నుంచి ప్రారంభం కావడం గొప్ప విశేషం.