telangana intelligence
-
వీఆర్ఏల ఆందోళన.. తెలంగాణ ఇంటెలిజెన్స్ మరో ఫెయిల్యూర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటెలిజెన్స్ మరోసారి విఫలం అయింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ వీఆర్ఏల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ.. ఇంటెలిజెన్స్ ఛలో అసెంబ్లీని పసిగట్టలేకపోయింది. మంగళవారం ఏడు సంఘాలు ఒకేసారి అసెంబ్లీ ముట్టకి యత్నించాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అనేక మంది వీఆర్ఏలు మూడు రోజుల ముందుగానే బంధువుల ఇళ్లకి చేరుకున్నారు. మంగళవారం విడతల వారీగా 6వేల మంది వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం, కాంగ్రెస్ రాజ్‌భవన్ ముట్టడిలను కూడా తెలంగాణ ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోయింది. ఇదిలా ఉంటే, వీఆర్ఏల అసెంబ్లీ ముట్టడి విషయం తెలుసుకున్న ఐటీ మంత్రి కేటీఆర్ వారితో సమావేశమయ్యారు. వీఆర్ఏ సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వీఆర్ఏలు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. 20న వీఆర్ఏలతో మళ్లీ చర్చలు జరుపుతామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. చదవండి: (Telangana VRAs: ప్రభుత్వంతో ముగిసిన వీఆర్ఏల చర్చలు) -
ఫేక్ సర్వే, శాకమూరి తేజోభాను అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీఎఫ్సీ సంస్థ డైరెక్టర్ శాకమూరి తేజోభానూని ఎట్టకేలకు జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ సర్వే పేరుతో ఫేక్ సర్వే విడుదల చేసిన టీఎఫ్సీ సంస్థపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న తేజోభానును పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ సర్వే చేసిందంటూ టీఎఫ్సీ మీడియా ఓ తప్పుడు కథనాన్ని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసింది. అయితే తాము ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి సర్వే చేయలేదని అది పూర్తిగా ఫేక్ అంటూ ఈ నెల 2వ తేదీన తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ హరిప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శాకమూరి తేజోభానుతో పాటు ఫేక్ సర్వే స్క్రిప్ట్ రైటర్ ముప్పాళ్ళ ప్రసన్నకుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ నెల 7న ప్రసన్నకుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న తేజోభానుకు తాజాగా నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేశారు. మరో డైరెక్టర్‌గా ఉన్న సంయుక్త...ఆమె వీడియో మార్ఫింగ్ చేసే సమయంలో ఆ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారా లేక రాజీనామా చేసి వెళ్ళారా అనే విషయంలో స్పష్టత కోసం పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా టీఎఫ్సీ మీడియా కార్యాలయం ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని ఎన్బీకే కాంప్లెక్స్లోను, బంజారాహిల్స్లోను, సాగర్ సొసైటీ కార్యాలయంలోను పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ ఈ ఫేక్ సర్వేను అప్డేట్ చేసేకంటే ముందే కార్యాలయాలు ఖాళీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. -
మార్చిలో రాష్ట్ర బడ్జెట్
సూచనప్రాయంగా వెల్లడించిన సీఎం కేసీఆర్ మూస పద్ధతికి భిన్నంగా కేటాయింపులు ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ఆదేశం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వేగవంతం చేయాలని సూచన సాక్షి, హైదరాబాద్: మార్చిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనప్రాయంగా వెల్లడించారు. వచ్చేనెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని శాఖల మంత్రులు, అధికారులు తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. మూస పద్ధతిలో కాకుండా అవసరమైన పనులకు బడ్జెట్ కేటాయింపులు జరిగేలా ప్రతిపాదనలు ఉండాలని చెప్పారు. నిరర్థక వ్యయాన్ని తగ్గించేందుకు శాఖల వారీగా సిఫారసులు కూడా రూపొందించాలని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వేగంగా అమలు జరగాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా వివరాలు తెప్పించుకున్న వెంటనే క్రమబద్ధీకరణ చేయాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ పని జరగాలని ఆదేశించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలన్న నిర్ణయాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం పలు అంశాలపై సీఎంవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ఉస్మానియా, గాంధీ, కింగ్ కోఠి ఆసుపత్రులకు అదనంగా మరో రెండు పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించాలని సీఎం నిర్ణయించారు. వీటి నిర్మాణానికి అనువైన స్థలాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిటీలోని అయిదు ఆసుపత్రుల్లోనూ అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందించాలని, అందుకు అనుగుణ మైన పరికరాలు సమకూర్చాలని చెప్పారు. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. బొగ్గు గని కార్మికులకు మెరుగైన వైద్యం అందేందుకు వీలుగా కోల్‌బెల్ట్‌లో కూడా సూపర్ స్పెషాలిటీ స్థాయి ఆసుపత్రి నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వరంగల్ ఎంజీఎంతో పాటు ఇతర ప్రాంతీయ వైద్యశాలలను కూడా మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. సీఎంకు ‘ఇంటెలిజెన్స్’ కృతజ్ఞతలు పోలీస్ శాఖలో ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ, సీఐడీ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మూల వేతనంపై 25 శాతం స్పెషల్ అలవెన్స్ ప్రకటించడంపై ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి నాయకత్వంలో ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ అధికారులు సీఎంను కలిశారు. స్పెషల్ అలవెన్స్ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.