మార్చిలో రాష్ట్ర బడ్జెట్ | Telangana state budget in march | Sakshi
Sakshi News home page

మార్చిలో రాష్ట్ర బడ్జెట్

Published Sat, Feb 6 2016 1:59 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్కు పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుతున్న ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్రెడ్డి, సెక్యూరిటీ అధికారులు - Sakshi

శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్కు పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుతున్న ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్రెడ్డి, సెక్యూరిటీ అధికారులు

సూచనప్రాయంగా వెల్లడించిన సీఎం కేసీఆర్
మూస పద్ధతికి భిన్నంగా కేటాయింపులు
ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ఆదేశం
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వేగవంతం చేయాలని సూచన

 
సాక్షి, హైదరాబాద్: మార్చిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనప్రాయంగా వెల్లడించారు. వచ్చేనెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని శాఖల మంత్రులు, అధికారులు తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. మూస పద్ధతిలో కాకుండా అవసరమైన పనులకు బడ్జెట్ కేటాయింపులు జరిగేలా ప్రతిపాదనలు ఉండాలని చెప్పారు.

నిరర్థక వ్యయాన్ని తగ్గించేందుకు శాఖల వారీగా సిఫారసులు కూడా రూపొందించాలని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వేగంగా అమలు జరగాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా వివరాలు తెప్పించుకున్న వెంటనే క్రమబద్ధీకరణ చేయాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ పని జరగాలని ఆదేశించారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలన్న నిర్ణయాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం పలు అంశాలపై సీఎంవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ఉస్మానియా, గాంధీ, కింగ్ కోఠి ఆసుపత్రులకు అదనంగా మరో రెండు పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించాలని సీఎం నిర్ణయించారు. వీటి నిర్మాణానికి అనువైన స్థలాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సిటీలోని అయిదు ఆసుపత్రుల్లోనూ అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందించాలని, అందుకు అనుగుణ మైన పరికరాలు సమకూర్చాలని చెప్పారు. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. బొగ్గు గని కార్మికులకు మెరుగైన వైద్యం అందేందుకు వీలుగా కోల్‌బెల్ట్‌లో కూడా సూపర్ స్పెషాలిటీ స్థాయి ఆసుపత్రి నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వరంగల్ ఎంజీఎంతో పాటు ఇతర ప్రాంతీయ వైద్యశాలలను కూడా మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు.
 
సీఎంకు ‘ఇంటెలిజెన్స్’ కృతజ్ఞతలు
పోలీస్ శాఖలో ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ, సీఐడీ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మూల వేతనంపై 25 శాతం స్పెషల్ అలవెన్స్ ప్రకటించడంపై ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి నాయకత్వంలో ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ అధికారులు సీఎంను కలిశారు. స్పెషల్ అలవెన్స్ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement