పురుషోత్తపట్నం అక్రమమే
ఏపీపై గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఏపీ చేపట్టిన పురుషోత్తపట్నం ప్రాజెక్టు ముమ్మాటికీ అక్రమమేనని, ఎలాంటి అనుమతులు లేకుండానే దీన్ని చేపట్టారని రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీన్ని నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి శుక్రవారం గోదావరి బోర్డుకు లేఖ రాశారు. అందులో ఏపీ చేపట్టిన ప్రాజెక్టు వివరాలు పేర్కొంటూ ఎలా అక్రమమో వివరించారు. బచావత్ ట్రిబ్యునల్ గోదావరి జలాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1,486 టీఎంసీల వినియోగంలో ఎక్కడా పురుషోత్తపట్నం ప్రస్తావన లేదని, ఆ తర్వాత సైతం దీని వివరాలలేవీ గోదావరి బోర్డుకు ఏపీ చెప్పలేదని పేర్కొన్నారు. తనకున్న కేలాయింపులను కాదని ఏపీ ఈ ప్రాజెక్టును చేపడితే తెలంగాణ నీటి వాటాల్లోని హక్కులకు భంగం తప్పదని వివరించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకోలేదని ఆ లేఖలో తెలిపారు.
‘మున్నేరు’ బ్యారేజీతో రాష్ట్రంలో ముంపు
కృష్ణా నదీ జలాలను వినియోగించుకుంటూ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో చేపట్టిన ‘మున్నేరు’ బ్యారేజీ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తింది. ఈ బ్యారేజీ నిర్మాణంతో తెలంగాణ ప్రాంతంలో ముంపు ఉందని కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పనులు ముందుకు సాగకుండా వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ అంతరాష్ట్ర నీటి పారుదల విభాగం అధికారులు కేంద్ర జల సంఘానికి లేఖ రాశారు.