పూర్తిస్థాయి కేబుల్ డిజిటైజేషన్‌కు ఐదేళ్లు
హైదరాబాద్: భారత్‌లో కేబుల్ వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటైజ్ చేసేందుకు ఐదేళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుందని తెలంగాణ ఎంఎస్‌వో ఫెడరేషన్ అధ్యక్షుడు ఎం.సుభాష్‌రెడ్డి చెప్పారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వహిస్తున్న ‘4వ కేబుల్ నెట్ ఎక్స్పో విజన్-2015’ శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి ప్రదర్శనల వల్ల ఎంఎస్‌వోలకు, కేబుల్ ఆపరేటర్లకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలుగుతుందన్నారు. ప్రతి కేబుల్ కనెక్షన్‌కు సెట్‌టాప్ బాక్స్ పెట్టాలన్నారు.
దీని ధర రూ. 1,500 నుంచి రూ. 2 వేల వరకు ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల వరకు డిజిటైజేషన్ ప్రక్రియ చేరుకోవడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. దేశంలో 25 కోట్లకుపైగా కేబుల్ కనెక్షన్లు ఉన్నాయని, 25 లక్షల టెక్నీషియన్లు ఉన్నప్పుడు డిజిటైజేషన్ ప్రక్రియ సజావుగా జరుగుతుందని చెప్పారు. కానీ, ప్రస్తుతం ఐదు లక్షల మంది టెక్నీషియన్లు కూడా లేరన్నారు. వినియోగదారులకు కావాల్సిన చానళ్లను నాణ్యమైన సిగ్నళ్లతో అందించేందుకు కేబుల్ వ్యవస్థ కృషి చేస్తోందన్నారు. ఎక్స్పో ముగింపు సందర్భంగా.. ఉత్తమ స్టాల్స్ నిర్వాహకులకు, ఎంఎస్‌వోలకు, కేబుల్ ఆపరేటర్లకు జ్ఞాపికలను అందజేశారు.