106 మంది టీచర్లకు తొలగింపు నోటీసులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరు అవుతున్న 106 మంది టీచర్లను తొలగించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ముందు వారికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాకు ఒక విచారణ అధికారిని నియమించనుంది. ఆ అధికారి నేతృత్వంలో ఆయా జిల్లాల్లో విధులకు గైర్హాజరైన టీచర్లకు నోటీసులు జారీ చేయనుంది. ఇలా అన్ని జిల్లాల్లో విధులకు గైర్హాజరు అవుతున్న టీచర్లకు విధుల నుంచి తొలగింపు నోటీసులను త్వరలో ఇవ్వనుంది. వారి నుంచి సమాధానం తీసుకొని సదరు అధికారి విద్యాశాఖ కమిషనర్‌కు నివేదిక పంపిస్తారని, ఆ నివేదికపై తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారి చెప్పారు.
30 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు..
అక్టోబర్ 30 నుంచి ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్షలు నవంబర్ 11 వరకు నిర్వహిస్తామని పేర్కొంది. ప్రతి రోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు ఉంటాయని వెల్లడించింది.