'రహదారుల ప్రతిపాదనకు గడ్కారీ ఆమోదం'
హైదరాబాద్: రాష్ట్రంలో 1018 కి.మీ మేర జాతీయ రహదారుల ప్రతిపాదనలను కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కారీకి ఇచ్చామని ... వాటికి ఆయన వెంటనే ఆమోదం తెలిపారని తెలంగాణ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గురువారం హైదరాబాద్లో తమ్ముల నాగేశ్వరరావు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రెండు లైన్లకు బదులుగా ఒకేసారి నాలుగు లైన్లు విస్తరించాలని ఆయన్ని కోరినట్లు తెలిపారు. అలాగే కేంద్రం జల రవాణా ప్రతిపాదనల్లో గోదావరి నదిని కూడా చేర్చాలని నితిన్ గడ్కారీని కోరినట్లు తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ బుధవారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాలోని మరికల్-జడ్చర్ల మధ్యగల జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రం వద్ద విజయవాడ నుంచి జగదల్పూర్ వెళ్లే ఎన్హెచ్ 221 విస్తరణ పనులకు, అలాగే రుద్రంపూర్ నుంచి భద్రాచలం వరకు రహదారి విస్తరణకు, గోదావరి నదిపై రెండో వంతెన నిర్మాణానికీ ఆయన శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రహదారులతోపాటు రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలని తుమ్మల నాగేశ్వరరావు... కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని కోరారు.