‘ఉస్మానియా’ పదోన్నతుల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: సీనియారిటీని తోసిరాజని మరీ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా నియమించారంటూ చెలరేగిన వివాదానికి తెరపడింది. ఇటీవల ఇచ్చిన ఆ పదోన్నతుల్లో పలు మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా రాయలసీమ ప్రాంతానికి చెందిన శివరామిరెడ్డిని నియమించడంతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ఆ పోస్టుకు తగిన అర్హత ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన సువర్ణను నియమించకుండా.. తెలంగాణవారికి అన్యాయం చేశారంటూ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఆందోళన ప్రారంభించారు. దాంతో ఉస్మానియాలో పనులు స్తంభించిపోయాయి. దీనికి తక్షణమే పరిష్కారం చూపాలని వైద్య విద్య డెరైక్టర్ ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు.
ఈ నేపథ్యంలో ఆ పదోన్నతుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. శివరామిరెడ్డిని అదే పోస్టు (ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్)లో నియమించింది. ఆ స్థానానికి పోటీ పడిన సువర్ణను ఉస్మానియా వైద్య కళాశాల సూపరింటెండెంట్‌గా, కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన పుట్టా శ్రీనివాస్‌ను వైద్య విద్య డెరైక్టర్ కార్యాలయంలో అదనపు సంచాలకుడిగా నియమించారు. అదనపు సంచాలకుడిగా ఉన్న వెంకటేష్‌ను వైద్య విద్యా సంచాలకుడు (అకడమిక్)గా నియమించారు. కాగా.. తక్షణమే ఈ ఉత్తర్వులను అమలు చేయాల్సిందిగా వైద్య విద్యా సంచాలకుడు శాంతారావును ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యమం జరుగుతున్న కారణంగానే ఈ మార్పులు చేసినట్టు సమాచారం.