Telangana Restaurant
-
ఆదాయం కోసం వ్యాపారులను ఇబ్బంది పెట్టం
తెలంగాణ రెస్టారెంట్, బార్ల అసోసియేషన్‌కు ఆబ్కారీ శాఖ మంత్రి పద్మారావు హామీ సాక్షి, హైదరాబాద్: ఆదాయం కోసం మద్యం వ్యాపారులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి టి. పద్మారావుగౌడ్ స్పష్టం చేశారు. బార్ల లెసైన్సు ఫీజు పెంపు, కొత్త లెసైన్సుల జారీ నిబంధనల మేరకే జరుగుతోందని హామీ ఇచ్చారు. తెలంగాణ రెస్టారెంట్ అండ్ బార్ లెసైన్సీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. మనోహర్ గౌడ్ నేతృత్వంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన బార్ల యజమానులు గురువారం సచివాలయంలో మంత్రి పద్మారావును కలిశారు. కొత్త బార్ పాలసీలో లెసైన్సు ఫీజులను మరో రూ.5లక్షల వరకు పెంచాలన్న ఆబ్కారీశాఖ ప్రతిపాదనలను బార్ల యజమానులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇప్పటి వరకు బార్ల లెసైన్స్ రెన్యూవల్ ఫీజు రూ. 10వేలు ఉంటే దానిని లక్షకు పెంచారని, కొత్త బార్ విధానంలో ఏకంగా లెసైన్సు ఫీజునే పెంచే ప్రతిపాదనలను అధికారులు చేశారని వివరించారు. ఈ ఏడాది లెసైన్స్ ఫీజు పెంచితే భరించే పరిస్థితిలో బార్ల యజమానులు లేరన్నారు. దీనిపై స్పందించిన మంత్రి.. తాను అమెరికాలో ఉన్నందు వల్ల ఆబ్కారీ శాఖ ప్రతిపాదనలు తన దృష్టికి రాలేదన్నారు. కొత్త బార్ పాలసీలో వ్యాపారులకు ఇబ్బంది లేని విధంగా నిర్ణయాలు ఉంటాయని హామీ ఇచ్చారు. -
100 మీటర్ల లోపు ‘నిబంధన’ సడలించాలి
తెలంగాణ రెస్టారెంట్ అండ్ బార్ లెసైన్స్ అసోసియేషన్ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై 100 మీటర్ల లోపు బార్లు ఉండకూడదనే నిబంధనను సడలించాలని తెలంగాణ రెస్టారెంట్ అండ్ బార్ లెసైన్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.మనోహర్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ.. బార్ అండ్ రెస్టారెంట్ల కు ప్రభుత్వం 180 ఎంఎల్ 375 ఎంఎల్ మద్యం సీసాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నెలకు ఐదుసార్లు మాత్రమే బార్లకు మద్యాన్ని సరఫరా చేస్తోందని.. ఈ నిబంధనను ఎత్తివేసి అమ్మగలిగినంత మేర మద్యాన్ని సరఫరా చేయాలని కోరారు. అదేవిధంగా మద్యం బాటిళ్లపై స్పెషల్ మార్జిన్‌ను ఎత్తివేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. రాత్రి 12 గంటల వరకూ బార్ లను నిర్వహించుకునేందుకు సమయాన్ని పొడిగించడం పట్ల తెలంగాణ రెస్టారెంట్ అండ్ బార్ లెసైన్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు జి.విజయ్ కుమార్ గౌడ్, వెంకంటేష్ గౌడ్, సాయిరాజ్ గౌడ్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. తిరుపతి రెడ్డి, నాయకులు కె. శంకర్, డి. శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఉడుతల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.