రూ.650 కోట్లతో పల్లె ప్రగతి: కేటీఆర్
జనవరిలో రేషన్ కూపన్లు అందిస్తాం
గల్ఫ్‌లో మనోళ్ల కష్టాలు కళ్లారా చూశా
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట: తెలంగాణ పల్లె ప్రగతి పథకం ద్వారా రూ.650 కోట్లతో మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తామని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట మండలాల్లో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పథకానికి 150 మండలాలను ఎంపిక చేశామని, పాడిపరిశ్రమకు పెద్దపీట వేస్తామన్నారు. ధాన్యం నిల్వ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లతో 290 గోదాములను నిర్మించనున్నట్లు వెల్లడించారు. మొదటి దఫాగా రూ.116 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.40 లక్షలతో వెంకటాపూర్‌లో ఐకేపీ గోదాంకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. వాటర్‌గ్రిడ్ కోసం వేములవాడ మండలం అగ్రహారం శివారులో స్థలాలను పరిశీలించామన్నారు. జనవరి నుంచి రేషన్ బియ్యం కూపన్లు అందిస్తామని, పింఛన్లు ఇచ్చేందుకు ఉత్తరం వేస్తే స్పందిస్తామని తెలిపారు. మధ్యమానేరు జలాశయం నుంచి కరీంనగర్, వరంగల్‌కు తాగునీరు అందిస్తామన్నారు. ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చానని, మనోళ్లు అక్కడ పడుతున్న కష్టాలను కళ్లారా చూశానని కేటీఆర్ పేర్కొన్నారు.