మోదం.. ఖేదం..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ చరిత్ర పుటలో మరో ఏడాది చేరింది. ‘తెలంగాణ’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన పార్టీలు ప్రజలకు చేరువయ్యేందుకు పాట్లు పడ్డాయి. జిల్లా రాజకీయ ముఖచిత్రంపై మార్పులు చోటు చేసుకున్నాయి. ‘తెలంగాణ’పై అధిష్టానం సానుకూలంగా స్పందించడం కాంగ్రెస్కుకలిసొచ్చిన అంశం. అయితే ఆ పార్టీలో రెండు గ్రూపుల పోరు చేటయ్యింది. టీఆర్ఎస్కు ‘సహకార’, ‘స్థానిక’ ఎన్నికలు ఊపునిచ్చాయి. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం జిల్లాలో టీడీపీకి శరాఘాతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకార సంఘాలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటింది.
నాలుగు రాష్ట్రాల్లో విజయం, ‘మోడీ’ నాయకత్వంతో బీజేపీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ప్రధాన పార్టీలకు చెందిన కొందరు నేతలు ఆ పార్టీ వైపు చూస్తున్నారు. సీపీఐ, సీపీఎంలు పోరుబాటలో సాగాయి. ఎమ్మెల్సీ, సహకార, పంచాయతీ ఎన్నికలు, తెలంగాణ ప్రకటనతో ఆందోళనలు జిల్లా రాజకీయాలను వేడెక్కించాయి. కాగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని నిర్మల్ పోలీసులు అరెస్టు చేయడం, ఆదిలాబాద్ జైలుకు తరలించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
కాంగ్రెస్‌ను వదలని గ్రూపులు..
అధికార కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వ ప్రకటన కలిసొచ్చిన అంశం. అయితే అప్పుడూ, ఇప్పుడూ ఆ పార్టీ జిల్లాలో సాధించిన విజయాలు ఏమీ లేవు. ఆ పార్టీని గ్రూపుల వివాదాలు అంటుకునే ఉన్నాయి. మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేంసాగర్‌రావు, నిర్మల్ ఎమ్మెల్యే ఎ.మహేశ్వర్‌రెడ్డి రెండు వర్గాలుగా ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి మహేశ్వర్‌రెడ్డి గ్రూపునకు మద్దతు ఇస్తున్నారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న అధికార పార్టీకి ఎంపీ వివేక్ దూరమయ్యారు. డీసీసీ కాల పరిమితి తీరి రెండేళ్లు దాటినా కొత్త అధ్యక్షుడిని నియమించ లేకపోయారు. నిర్మల్ వేదికగా నిర్వహించిన తెలంగాణ కృతజ్ఞత సభ సక్సెస్ కాంగ్రెస్‌కు కలిసొచ్చింది.
అవసానదశకు టీడీపీ..
తెలుగుదేశం పార్టీ జిల్లాలో అవసానదశకు చేరింది. టీడీపీ నేతల తెలం‘గానం’ను ప్రజలు విశ్వసించడం
లేదు. చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతంపై విసిగిన ఇద్దరు ఎమ్మెల్యేలు గతేడాదే ఆ పార్టీని వీడారు. ప్రస్తుతం సీనియర్లుగా ఉన్న ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు బీజేపీ, టీఆర్ఎస్ల వైపు చూస్తున్నారు. ఒక ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలున్న ఆ పార్టీకి ఎంపీతోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలే మిగలగా భవిష్యత్‌లో ఆ పార్టీకి ఎవరూ మిగులుతారనేది చర్చనీయాంశమైంది. తెలంగాణ జిల్లాలన్నింటితో పోలిస్తే జిల్లాలో పార్టీని ఆదరించిన ప్రజలు ఇప్పుడు ఆ పార్టీ వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటంతో టీడీపీ పరిస్థితి అవసానదశకు చేరింది.
పదును తగ్గని ఉద్యమం..
‘ప్రత్యేక’ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ జిల్లాలో నిరంతర ఉద్యమాలతో దూసుకెళ్లింది. ఈ ఏడాదంతా ‘ప్రత్యేక’ ఉద్యమాలకు అంకితమైన టీఆర్ఎస్ పార్టీ రాజకీయ జేఏసీ, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతో కలిసి ఆందోళనల్లో పాల్గొంది. కేసీఆర్ జిల్లాలో నిర్వహించిన పలు కార్యక్రమాలకు హాజరై నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపారు. సహకార, పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటింది. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి సుధాకర్ రెడ్డి, పట్టభద్రుల నుంచి స్వామిగౌడ్‌లు ఎమ్మెల్సీలు కాగా, ఎంపీ వివేక్ జూన్ 2న కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్లో చేరడం పార్టీకి బలం పెరిగింది. జూన్ 30న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన వెలువడటం ఆ పార్టీ విజయంగా శ్రేణులకు సంకేతం ఇచ్చింది. నవంబర్ 31, డిసెంబర్ 9 తేదీలలో దీక్ష, విజయ్ దివస్లకు మంచి స్పందన వచ్చింది.
బీజేపీలో ‘మోడీ’ జోష్..
ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్న పార్టీల జాబితాలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఆ పార్టీ అగ్రనేత నరేంద్రమోడి జోష్ పెరిగింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై బీజేపీ ఉద్యమాలు నిర్వహించింది. పార్టీలో చేరేందుకు తహతహలాడుతున్న తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల సీనియర్ నేతలకు జిల్లా బీజేపీ ఆహ్వానం పలుకుతుంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు వద్దంటూ జిల్లా బీజేపీ ఆ పార్టీ అధిష్టానంకు లేఖలు రాయడం చర్చనీయాంశమైంది. ఇటీవల ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడం ఆ పార్టీ కేడర్‌లో ఉత్సాహం రెట్టింపయ్యింది.
‘స్థానిక’ంలో వైఎస్సార్ సీపీ విజయం
దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ ఆశయాల సాధన, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెరపైకి వచ్చింది. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజల మధ్యకు వచ్చిన వైఎస్సార్ సీపీ అనతికాలంలో ప్రజలకు చేరువైంది. ఈ ఏడాదిలో జరిగిన సహకార, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖాతా తెరిచి సత్తా చాటింది. పార్టీ ఆవిర్భావం సమయంలో జిల్లా కన్వీనర్‌గా వ్యవహరించిన నేత బి.జనక్‌ప్రసాద్, కొత్తగా కన్వీనర్‌గా నియమితులైన కొమ్ముల వినాయక్‌రెడ్డి, జిల్లా కో-కన్వీనర్ ఎన్.రవిప్రసాద్, ఆదిలాబాద్ సమన్వయకర్త బి.అనిల్‌కుమార్, చల్లగుళ్ల విజయశ్రీ, ముత్తినేని రవికుమార్, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు మేకల ప్రమీలలతోపాటు పలువురు జిల్లాలో పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్నారు. జిల్లాలో మూడు పర్యాయాలు పర్యటించిన విజయమ్మ జిల్లా ప్రజలపై ఉన్న ప్రేమాభిమానాలు చాటుకున్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంపై స్పందించిన తుమ్మిడిహెట్టి వద్ద దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వేసిన శిలాఫలకానికి క్షీరాభిషేకం చేసి ప్రభుత్వంపై నిరసన తెలిపారు. జులైలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించిన విజయమ్మ బాధిత కుటుంబాలను కలుసుకుని పరామర్శించారు.
పోరుబాటలో సీపీఐ, సీపీఎంలు..
సీపీఐ, సీపీఎంలో జిల్లాలో తమ ఉద్యమ పంథాను పదునెక్కించాయి. వామపక్ష ఉద్యమాలు, కార్మిక సమస్యలపై దృష్టిసారించిన సీపీఐ జిల్లాలో తెలంగాణ ఉద్యమాల్లో ఉధృతంగా పాల్గొంది. ప్రత్యేక తెలంగాణ అజెండాకు కట్టుబడిన సీపీఐ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించుకుంది. సమైక్యవాద నినాదానికి కట్టుబడిన సీపీఎం ఈ ఏడాది జెండా, అజెండాల మేరకు పనిచేసింది. రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని వినిపించగా.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి సమైక్యవాదానికి కట్టుబడింది. ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమాలను నిర్వహించిన సీపీఎం పార్టీ నిర్మాణం, పార్టీ కార్యక్రమాల అమలుపై దృష్టి సారించింది.