టీఆర్ఎస్ తీరు మారాలి
వైఎస్సార్ సీపీ ఎంపీ పొంగులేటి
హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టంలో ప్రతిపక్షమే ఉండకూడదన్నట్లుగా టీఆర్ఎస్ వ్యవహరించడం సరికాదని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఏ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అ పార్టీలోనే ఉండే విధంగా అధికార పార్టీ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గురువారం కింగ్‌కోఠిలోని తన నివాసంలో వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెహ్మాన్ పార్టీ తెలంగాణ నేతలకు విందు ఇచ్చారు.
ఈ సందర్భంగా హాజరైన పొంగులేటి మాట్లాడుతూ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రజల బాగోగులు పక్కనపెట్టి ఒంటెద్దు పోకడలు పోతుందని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా అధికార పార్టీ ప్రతిపక్షాలతో కలిసి మంచి పరిపాలన అందించాలని ఆయన కోరారు. కాగా ఎంపీ పొంగులేటిని ఈసందర్భంగా రెహ్మాన్ నేతృత్వంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజాద్ బాషా, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు శివకుమార్, కొండా రాఘవరెడ్డి, ముజీ దాబిన్ హైమద్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, సురేశ్‌గౌడ్, రాహుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.