నేరరహిత హైదరాబాద్ హోంమంత్రి నాయిని
హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌ను నేర రహిత మహానగరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. నగరంలో 600 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవారి భరతం పడతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో వనస్థలిపురం హుడా ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సంబరాలకు బుధవారం నాయిని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన స్తూపం, 60 అడుగుల స్తంభంపై ఆవిష్కరించిన జెండా వద్ద అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రజలపై వ్యతిరేకత లేదని, తెలంగాణను ఆగం చేసిన నాయకులపైనే తమ వ్యతిరేకత అని తెలిపారు. తెలంగాణను అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నేడు తెలంగాణను నవ తెలంగాణ చేస్తానంటున్నాడని విమర్శించారు. హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాల వారికి లేని రక్షణ చర్యలు ఆంధ్రా వారికే ఎందుకని ప్రశ్నించారు.