Telangana state sports school
-
‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ కేంద్రంగా స్పోర్ట్స్ స్కూల్
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాన్ని మరింత ఫలవంతం చేసేందుకు క్రీడా శాఖ పటిష్ట కార్యాచరణతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యార్థులను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించింది. ఈ మేరకు తెలంగాణలో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌ను ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (కేఐఎస్‌సీఈ)’ కేంద్రంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు రాగా మెరుగైన క్రీడా వసతులున్న ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర క్రీడా శాఖ ఆమోదముద్ర దక్కింది. అందులో తెలంగాణలోని హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి. దీనితో పాటు కర్ణాటక, ఒడిశా, కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరామ్, నాగాలాండ్ రాష్ట్రాలు కూడా కేఐఎస్‌సీఈలను ఏర్పాటు చేయనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, శిక్షణ, వసతుల ఆధారంగానే వీటిని ఆమోదించినట్లు క్రీడాశాఖ వెల్లడించింది. వీటి అభివృద్ధికి కేంద్రం నుంచి గ్రాంట్ లభించనుంది. కేఐఎస్‌సీఈ హోదాకు తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌ను ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని క్రీడాకారులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. -
యూకేలో శిక్షణకు టీఎస్‌ఎస్‌ఎస్ అథ్లెట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ (టీఎస్‌ఎస్‌ఎస్)కు చెందిన ముగ్గురు అథ్లెట్లకు గొప్ప అవకాశం లభించింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లాబరో యూనివర్సిటీ అందించే అత్యుత్తమ అథ్లెటిక్స్ శిక్షణకు వీరు ఎంపికయ్యారు. టీఎస్ఎస్ఎస్లో ఇంటర్ చదువుతోన్న వై. హరికృష్ణ, కె. అరవింద్, పదో తరగతి విద్యార్థిని డి. భాగ్యలక్ష్మి ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. వీరు ఇటీవలే జరిగిన టాటా టీ జాగోరే ‘జాతీయ అథ్లెటిక్స్’లో మెరుగైన ప్రతిభ కనబరిచి ఈ శిక్షణకు అర్హత సాధించారు. యూకేలో ఏప్రిల్‌లో 8 రోజుల పాటు కోచింగ్ క్యాంపు జరుగుతుంది. దేశవ్యాప్తంగా 12 మంది అథ్లెట్లు ఈ క్యాంపునకు ఎంపికవగా టీఎస్‌ఎస్‌ఎస్ విద్యార్థులే ముగ్గురు ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా టీఎస్‌ఎస్‌ఎస్ ఓఎస్డీ కె. నర్సయ్య, అథ్లెటిక్స్ కోచ్ పీబీ ఆదిత్య, క్రీడాధికారి ఆర్కే బోస్ విద్యార్థులను అభినందించారు. -
జాతీయ రోయింగ్‌లో టీఎస్ఎస్ పతకాల పంట
5 స్వర్ణాలు సహా 9 పతకాలు ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ సబ్ జూనియర్ రోయింగ్, జాతీయ స్కూల్స్ రోయింగ్ చాంపియన్‌షిప్‌లలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ (టీఎస్ఎస్) క్రీడాకారులు సత్తా చాటారు. ఐదు బంగారు పతకాలు సహా తొమ్మిది పతకాలు సాధించారు. జాతీయ సబ్ జూనియర్ రోయింగ్ పోటీలు ఇటీవల కోల్‌కతాలో జరిగాయి. ఈ పోటీల్లో బాలుర టీమ్ విభాగంలో రెండు స్వర్ణా లు, కాంస్యం, బాలికల టీమ్ విభాగంలో ఒక్కో పసిడి, కాంస్యం టీఎస్ఎస్ రోయర్లు గెలిచారు. అక్కడే జరిగిన జాతీయ స్కూల్ రోయింగ్ చాంపియన్‌షిప్‌లో బాలుర సింగిల్స్ స్కల్ ఈవెంట్లో సి.హెచ్. నవీన్ బంగారు పతకం గెలుచుకోగా... విజయ్, త్రినాథ్, సునీల్, ఆరిఫ్, గణేష్‌లతో కూడిన జట్టు టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలిచింది. బాలికల సింగిల్స్ స్కల్ ఈవెంట్లో గీతాంజలి కాంస్యం దక్కించుకుంది. బాలికల టీమ్ విభాగంలో సీతా మహాలక్ష్మి, లక్ష్మీప్రసన్న, అర్చన, మనస్విని, ప్రియాంకలతో కూడిన బృందం రజతం గెలిచింది. జాతీయ రోయింగ్ పోటీల్లో పతకాలను గెలిచిన తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ క్రీడాకారులను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (టీఎస్ఏ) మేనేజింగ్ డైరె క్టర్ రాహుల్ బొజ్జా, రాష్ట్ర రోయింగ్ కోచ్ చక్రవర్తి అభినందించారు.