గిరిజన హక్కులను కాలరాస్తున్న మోదీ
* తెలంగాణ గిరిజన సంఘం బహిరంగ సభలో బృందాకారత్
సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గిరిజనులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జరిగిన తెలంగాణ గిరిజన సంఘం బహిరంగసభలో ఆమె మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని నీరుగారుస్తోందన్నారు. అధికారంలోకి రాక ముందు స్వర్గాన్ని చూపిస్తానని చెప్పి ఇప్పుడు నరకాన్ని చూపుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో గిరిజనుల భూములను లాక్కుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయకుంటే సమాజంలో తీవ్రమైన అసమానతలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధిపత్య, పాశ్చాత్య సాంస్కృతిక దాడిలో ఆదివాసీ తెగల సంస్కృతులన్నీ తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయన్నారు.
ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి అనేక మంది ఆదివాసీల జీవితాలను విధ్వంసం చేస్తోందని విమర్శించారు. అంతకు ముందు గిరిజన సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఇందిరా పార్కు నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు వేలాది మంది గిరిజనులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. లంబాడీ, గుస్సాడి, థింసా, బుడియబాపు, తీజ్, కోలాటం తదితర సాంస్కృతిక నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అనంతరం గిరిజనుల ఆరాధ్యమైన సంత్ సేవాలాల్ సినిమాను ప్రదర్శించారు. కార్యక్రమంలో లంబాడా హక్కుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్‌నాయక్, ఎంపీ జితిన్‌చౌదరి, త్రిపుర గిరిజన మంత్రి అఘోరదేవ్ బర్మన్, ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ చైర్మన్ బజ్‌బాన్ రియాజ్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు శ్రీరాంనాయక్, శోభన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.