చేనేత ప్రచారకర్తగా కేటీఆర్..
ఆ వస్త్రాలు ధరించి సచివాలయానికి వచ్చిన మంత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, చేనేత మంత్రి కె.తారకరామారావు చేనేత ప్రచారకర్తగా మారారు. చేనేత దస్తులు ధరించి వచ్చి సోమవారం సచివాలయంలో సందడి చేశారు. చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ వారంలో ఓ రోజు చేనేత వస్త్రాలు ధరిం చాలని పిలుపునిచ్చిన మంత్రి.. సోమవారం స్వయంగా ఆ వస్త్రాలు ధరించి వచ్చారు. మంత్రి పిలుపు మేరకు ఆయన కార్యాలయం అధికారులు, సిబ్బంది కూడా ఆ దుస్తులే ధరించి రావడంతో ప్రత్యేకత సంతరిం చుకుంది. ఇక నుంచి ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరిస్తానని మంత్రి తెలిపారు. దీని ద్వారా చేనేత వస్త్రాల ప్రాముఖ్యత, ప్రాశస్త్యాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్తామన్నారు. చేనేత కార్మికుల ఉత్పత్తులకు ప్రచారం కల్పిం చేందుకు తెలంగాణ చేనేత శాఖ (టెస్కో) ద్వారా మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు.
ఈ మేరకు చర్యలు తీసుకోవాలని టెస్కో డైరెక్టర్ శైలజా రామయ్యర్కు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పిలుపుతో ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమి షనర్లు, ఇతర శాఖల అధికారులు సోమవారం చేనేత వస్త్రాలను ధరిస్తున్నారని మంత్రి కార్యాలయం తెలిపింది. పరిశ్రమలు, ఐటీ, పురపాలక, చేనేత శాఖల విభాగాధిపతులు, ఉద్యో గులు సైతం చేనేత దుస్తుల్లో వచ్చి మంత్రి కేటీఆర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, జల మండలి ఎండీ దానకిశోర్, టెస్కో డైరెక్టర్ శైలజా రామయ్యర్ తదితరులు తమ ఉద్యోగుల బృందంతో మంత్రిని కలిశారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరిస్తామని మంత్రికి మాట ఇచ్చారు.