Telangnaa govt
-
రేషన్‌కార్డే ప్రామాణికం! లేకపోతే నో
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలలో భాగంగా ఈ నెలలోనే అమలు చేయాలని భావిస్తున్న మరో రెండు గ్యారంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లోనే రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (గృహజ్యోతి) హామీల అమలు ప్రక్రియ ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ రెండు హామీలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికకు రేషన్‌కార్డు (ఆహార భద్రతా కార్డు)నే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకోసం సంబంధిత అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు కూడా ప్రారంభించింది. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు సంబంధించి విద్యుత్ శాఖ, రూ 500కు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ప్రక్రియపై పౌరసరఫరాల శాఖ విధి విధానాలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు అందినప్పటికీ, నేరుగా వినియోగదారుల నుంచి అర్హతకు సంబంధించిన పత్రాలు తీసుకోవాలని ఆయా శాఖలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియను మంగళవారం నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. కోత తప్పదా? రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్ (గృహ వినియోగ) గ్యాస్ కనెక్షన్లు ఉండగా, 1.23 కోట్ల గృహావసర విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు ప్రస్తుతం రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద జారీ అయిన ఆహార భద్రతా కార్డులు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహార భద్రతా కార్డులు కలిపి 90,14,263 రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం వీరందరికీ రెండు గ్యారంటీలను అమలు చేయాల్సి వస్తే ఎలాంటి అభ్యంతరాలు, నిబంధనలు లేకుండా అమలు చేయాలి. కానీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలనే అర్హులుగా పరిగణించాలని భావిస్తే మాత్రం గణనీయంగా కోత తప్పదని ఓ అధికారి తెలిపారు. ఈ పరిస్థితుల్లో లబ్ధిదారుడి ఆర్థిక, సామాజిక స్థితి గతులను కూడా పరిగణనలోకి తీసుకొని రెండు గ్యారంటీలను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే వచ్చిన ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసే కార్యక్రమం ఓవైపు సాగుతుండగా, విద్యుత్ శాఖ, పౌరసరఫరాల శాఖ తరఫున మరోసారి లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ సాగనున్నట్లు సమాచారం. బిల్లులు ఎవరు కడితే వారి పేరుపైనే.. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని అమలు చేసేందుకు మంగళవారం నుంచే విద్యుత్ శాఖ రంగంలోకి దిగనుంది. ఈనెల కరెంటు బిల్లు లెక్కలు తీసుకునేందుకు వచ్చే వ్యక్తి బిల్లు కోసం వచ్చినప్పుడే మీటర్ నంబర్ యాక్టివేట్ అవుతుంది. ఆ బిల్లుకు సంబంధించి ఉన్న ఇంటి యజమాని ఆధార్, రేషన్‌కార్డు (ఆహారభద్రతా కార్డు), ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు ఎంట్రీ చేసే కార్యక్రమం కొనసాగనుంది. ఒకవేళ ఇంటి యజమాని కాకుండా అద్దెకు ఉన్న వ్యక్తులు కరెంటు బిల్లులు చెల్లిస్తున్నట్టయితే, ఆ కిరాయిదారు పేరు మీద మీటర్‌ను యాక్టివేట్ చేస్తారు. రేషన్‌కార్డు లేని వారి నుంచి వివరాలు తీసుకోరు. ఈ వివరాలతో పాటు ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తుల్లోని వివరాలు కూడా పరిశీలించి ప్రభుత్వం అర్హులను ఎంపిక చేయనుంది. ఉచిత విద్యుత్ పథకానికి ఏటా రూ.4 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిసింది. ఏడాదికి ఆరు సిలిండర్లు! గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి.. సిలిండర్ బుక్ చేసినప్పుడు డెలివరీ కోసం వచ్చిన వ్యక్తి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కేవైసీ తరహాలో లబ్ధిదారుల వివరాలను సేకరించడంతో పాటు గ్యాస్ సిలిండర్, ఆధార్, రేషన్‌కార్డు నంబర్లను తీసుకుంటారు. వీటితో పాటు ఆర్థిక స్థోమతను అంచనా వేయడానికి కుటుంబ వివరాలను కూడా తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇలావుండగా ఒక కుటుంబానికి సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు రూ.500 చొప్పున సరఫరా చేయాలనే అంశంపై స్పష్టత రావలసి ఉంది. అయితే ఒక పేద కుటుంబానికి ఏడాదికి 6 సిలిండర్లు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. సంవత్సరానికి 6 సిలిండర్లు రూ.500 చొప్పున ఇచ్చినా రేషన్‌కార్డుల లెక్క ప్రకారం ఏడాదికి రూ.3,245 కోట్లు సబ్సిడీ రూపంలో వెచ్చించాల్సి వస్తుందని అంచనా. అయితే దీనికి సంబంధించి ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించనుంది. -
తెలంగాణ మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు.. గోల్డ్ మెడల్ సాధించిన సురేష్
వయసు పెరిగినా తమలో క్రీడా నైపుణ్యం తగ్గలేదని ఆ అథ్లెట్లు నిరూపించారు. 40 ఏళ్ల పైబడిన వయసులోనూ వెయిట్ లిఫ్టింగ్ లో అదరగొట్టారు. హైదరాబాద్‌లోని పోస్టల్ కన్వెన్షన్ హాల్ వేదికగా జరిగిన మొట్ట మొదటి మాస్టర్స్ స్టేట్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్షిప్, సౌత్ ఇండియా మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో పలు రాష్ట్రాల క్రీడాకారులు సత్తా చాటారు. తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఈ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్, రాష్ట్ర షిప్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ బాలరాజు యాదవ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కె.కిషోర్ గౌడ్ హాజరయ్యారు. ఐదు రాష్ట్రాల నుంచి మాస్టర్ అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పురుషుల, మహిళల విభాగాల్లో 30 నుంచి 80 వయస్సు కలిగిన అథ్లెట్లకు ఈ పోటీలు నిర్వహించారు. చాంపియన్స్‌గా సురేష్..శ్వేత పురుషుల విభాగంలో 9 కేటగిరీల్లోనూ, మహిళల విభాగంలో 10 కేటిగిరీల్లోనూ పోటీలు జరిగాయి. 30 ఏళ్ల వయస్సు తర్వాత కూడా క్రీడల్లో రాణించే అథ్లెట్లను ప్రోత్సహించేందుకే ఈ పోటీలను నిర్వహించినట్టు ఈవెంట్ నిర్వహకులు వెల్లడించారు.81 కిలోల పురుషుల విభాగంలో కే సురేష్ స్వర్ణం సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు. మహిళల 76 కేజీల విభాగంలో శ్వేత స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. -
తప్పంతా సిబ్బందిదేనట!
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగుల వ్యవహారంపై చేపట్టిన దర్యాప్తు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తం గా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఉన్నతాధికారుల విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది. అసలు సూత్రదారులను వదిలే సి, తప్పంతా కింది స్థాయి సిబ్బందిదేనని అధికారులు తేల్చడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో ఆయా, సూపర్వైజర్లపై వేటు వేసిన ఉన్నతాధికారులు.. ఇద్దరు స్టాఫ్‌నర్సులకు మెమోలు జారీ చేసి చేతులు దులుపుకోవడం గమనార్హం. సాక్షాత్తూ డీఎంఈ రమేశ్‌రెడ్డి విచారణ జరిపినా అసలు నిందితులు బయటకు రాకపోవడమేమిటో అంతు చిక్కడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం.. జిల్లా ఆస్పత్రిలో రెండు నెలల పాటు ఎలాంటి అనుమతి లేకుండా 17 మంది ఉద్యోగులుగా కొనసాగుతూ వైద్యం చేసిన ఘటన బయటకు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా జిల్లా ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగులు తిష్ట వేసి, ఏకంగా అత్యవసర విభాగంలోనూ వైద్యచికిత్సలు అందించడం అప్పట్లో కలకలం రేపింది. ఆస్పత్రిలోని 328వ గదిలో అక్రమార్కులు తమ దందా కొనసాగించడం, బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడం, ఈ గదిలోనే నకిలీ ఉద్యోగులకు విధులు కేటాయించడం చేశారు. దాదాపు రెండు నెలలు ఉద్యోగుల పేరిట ప్రైవేట్ వ్యక్తులు ఆస్పత్రిలో ఇంజక్షన్లు, ఇతరత్రా చికిత్సలు అందించడం చేశారు. అయితే, అత్యవసర విభాగంలో ఓ రోగికి యువకుడు సూది మందు ఇచ్చే విధానంలో తేడా కనిపించడాన్ని గమనించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు ఆ యువకుడ్ని వారించాడు. అసలు నువ్వు ఎవరని ఇంజక్షన్ ఇస్తున్న యువకుడ్ని సూపరింటెండెంట్ గట్టిగా నిలదీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాను కొత్తగా రిక్రూట్ అయినట్లు సదరు వ్యక్తి చెప్పడంతో అవాక్కయిన రాములు అసలు విషయం ఆరా తీయగా నకిలీ ఉద్యోగుల యవ్వారం బయట పడింది. మొత్తం 17 మంది నకిలీ ఉద్యోగులు ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్నట్లు తేలింది. ఈ విషయం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది డీఎంఈ విచారించినా.. ఈ వ్యవహారంపై కలెక్టర్‌తో పాటు ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి ఆస్పత్రికి స్వయంగా విచారణ జరిపారు. మాక్లూర్ మండలానికి చెందిన ఓ యువకుడు.. జిల్లా ఆస్పత్రిలో కొలువుల పేరిట కొంత మంది యువతీయువకుల నుంచి డబ్బులు వసూలు చేసి, వారిని ఆస్పత్రిలో ఉంచి పని చేయించినట్లు తేలింది. బాధితులతో పాటు నిందితుడ్ని విచారించిన డీఎంఈ.. ఆస్పత్రి అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రైవేట్ వ్యక్తులు ఆస్పత్రిలో నేరుగా వైద్యసేవలు అందించడం, శిక్షణ పేరిట కొనసాగడంపై ఎందుకు పసిగట్టలేకపోయారని గట్టిగా క్లాస్ తీసుకున్నారు. దీంతో ఆస్పత్రిలోని కీలక అధికారులపై చర్యలు తప్పవని అంతా భావించారు. ఏం జరిగిందో ఏమో కానీ, తప్పంతా చిరుద్యోగులేనని ఉన్నతాధికారులు వారిపై కొరడా ఝళింపించారు. ఆయా, సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించారు. అలాగే, అత్యవసర విభాగం, ఓపీ విభాగం వద్ద విధులు నిర్వర్తించే స్టాఫ్‌నర్సులకు మెమోలు జారీ చేసి, అధికారులు చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందుకు సాగని కేసు నకిలీ ఉద్యోగుల వ్యవహారంలో బాధితులు ఒకటో టౌన్లో ఫిర్యాదు చేశారు. మాక్లూర్ మండలం గుత్పకు చెందిన సతీష్ ఉద్యోగాల పేరిట డబ్బుల తీసుకుని తమను జిల్లా ఆస్పత్రిలో చేర్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సతీష్‌ను ప్రశ్నించిన అధికారులు.. మోపాల్ మండలం కాల్పోల్కు చెందిన గోపాల్ పేరును వెల్లడించాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నెల రోజులు గడిచినా కేసు విచారణ కొలిక్కి తేలేక పోయారు. అసలు సూత్రదారులను వెలికి తీయడంలో జాప్యం జరుగుతుండడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము మోసపోయమని, తమకు న్యాయం చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరిని తొలగించాం.. నకిలీ ఉద్యోగుల వ్యవహారంలో ఒక ఆయాతో పాటు సంబంధిత ఫ్లోర్ సూపర్వైజర్ను తొలగించాం. ఇద్దరు స్టాఫ్‌నర్సులకు మెమోలు జారీ చేశాం. ఆస్పత్రి నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – డా.రాములు, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ఆ పాఠశాలలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి
సాక్షి, హైదరాబాద్: అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పలు ప్రై వేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు వన్‌టైం స్పెషల్ ఫీజు అంటూ రూ.లక్షలు వసూలు చేస్తున్నాయని, ఇది ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధమంటూ హెచ్ఎస్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్.రవికుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తమకు కొంత గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కొన్ని స్కూళ్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎ.సంజీవ్‌కుమార్ స్పందిస్తూ, కొన్ని పాఠశాలలు అసాధారణ రీతిలో ఫీజులు వసూలు చేస్తున్న మాట వాస్తవమేనని తెలిపారు. తాము నిర్వహించిన విచారణలో ఈ విషయం తేలిందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అలా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలకు నోటీసులు కూడా జారీ చేశామని ఆయన తెలిపారు. అయితే అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో ఆ వివరాలను తమ ముందుంచాలని సంజీవ్‌కుమార్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. పాఠశాలల్లో ప్రవేశాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని సుదీర్ఘ కాలం పాటు వాయిదా వేయబోమన్న ధర్మాసనం, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.