భారతి టెలికాంలో సింగపూర్ టెలీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్ సింగ్టెల్ రెండు దేశాల టెలికాం దిగ్గజాలపై కన్నేసింది. ఈ నేపథ్యంలోనే సింగ్ టెల్ థాయ్ టెలికాం సంస్థ ఇన్ టచ్ హోల్డింగ్స్ , ఇండియాకు చెందిన భారతి టెలికం లిమిటెడ్ కంపెనీల్లో సుమారు రెండు బిలియన్ల డాలర్లతో వాటాలను కొనుగోలు చేయనుంది. భారత్, థాయ్ లాండ్ టెలికాం మార్కెట్ పై భారీగానే ఆశలు పెట్టుకున్న సంస్థ ఈ మేరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమౌతోంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పాగా వేయాలనే దాని వ్యూహంలో భాగంగా మొత్తం 1.8 మిలియన్ డాలర్స్ తో డీల్ కుదుర్చుకుంది. ఇన్ టచ్ లో 21 శాతం, భారతి ఎయిర్టెల్ సొంతమైన భారతి టెలీలో 7.39 శాతం వాటాలను కొనుగోలు చేయనున్నట్టు సింగపూర్ స్టాక్ మార్కెట్ ఫైలింగ్ లో సింగ్ టెల్ పేర్కొంది. సింగె టెల్ కొనుగోలు చేస్తున్న భారతి టెలీవాటాల విలువ రూ. 4,400 కోట్లకు పైమాటే. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తికానుందని తెలిపింది. అంతర్గత నగదు, స్వల్పకాలిక రుణాల ద్వారా ఈ వాటాలను హస్తగతం చేసుకోనున్నట్లు సింగ్ టెల్ తెలిపింది.
ఈ రెండు లావాదేవీల ద్వారా రెండు కంపెనీల్లోతమ పెట్టుబడుల వృద్ధికి, తద్వారా ఆర్థిక వృద్ధికి భారీ అవకాశాలున్న రెండుదేశాల్లోతమ కార్యకలాపాల వృద్ధి సాధ్యపడుతుందని భావిస్తున్నామని సింగ్టెల్ గ్రూప్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చువా సాక్ చెప్పారు. ఈ రెండుదేశాల్లోని యువత జనాభా వివరాలను ఉదాహరించిన ఆమె తమ టెలికాం వ్యాపారానికి సానుకూలమైన అంశమని పేర్కొన్నారు.
ఇది వెల్ ప్యాకేజ్డ్ డీల్ అని నోమురా బ్యాంక్ వ్యాఖ్యానించింది. సింగ్టెల్ ఆదాయాలకు బూస్ట్ ఇస్తుందని, కానీ థాయ్ మరియు భారత మార్కెట్లలో ఎల్లప్పుడూ నిశ్చితంగా ఉండవనేది గమనించాలని తెలిపింది. మరోవైపు సింగ్ టెల్ భారతి టెలీలో 7.39 శాతం వాటాను కొనుగోలు చేసిందన్న వార్తలతో మార్కెట్లో షేరుకు డిమాండ్ పెరిగింది. 2 శాతానికి పైగా లాభపడింది. అయితే ఈ వ్యవహారంపై తమకు ఎలాంటి సమాచారం లేదని థాయిలాండ్ స్టాక్ ఎక్సేంజీ తెలపగా , దీనిపై వ్యాఖ్యానించడానికి భారతి ఎయిర్ టెల్ నిరాకరించడం విశేషం.