ఇప్పటికింకా మా వయస్సు నిండా పదహారే
ఎవరన్నారు ముసలితనానికి దసరా వేషాలని..?
సంకల్పం..సాహసం..సాధన ఉండాలే కానీ యువతరానికి ధీటుగా వారు కూడా రాణించగలరు..అరుదైన రికార్డులు సృష్టించగలరు. సాహసమే ఊపిరిగా సాగిపోగలరు. యువతకు స్ఫూర్తినివ్వగలరు. 80 ఏళ్ల వయసులోనూ పతకాలు తేగలరు. 70 ఏళ్లు దాటినా చిరుతలా దూసుకుపోగలరు. వృద్ధాప్యం వయసుకుగానీ మనసుకు కాదని ఛాలెంజ్ చేసి మరి చెబుతున్నారు. దమ్ముంటే మాతో పోటీ పడండి డూడ్ అంటూ సవాల్ చేస్తున్నారు. హెన్స్ ప్రూవ్డ్..కావాలంటే వీరిని చూడండి.
వృద్ధాప్యంలోనూ వెటరన్ క్రీడల్లో పతకాలు పంట లక్ష్మి,రాజు
చోడవరం: అరవైయేళ్లు దాటితే ఇక జీవితం వృద్ధాప్యంలోకి వచ్చేశామంటూ చాలా మంది నిట్టుర్పుగా బతుకుతారు. వృద్ధాప్యం వస్తే జీవితం ముగిసిపోయినట్టు అనుకుంటారు. మనస్సుకు, మానసిక ఉల్లాసానికి వయస్సు లేదంటున్నారు ఈ వెటరన్ క్రీడాకారులు. 75యేళ్ల వయస్సులోనూ అంతర్జాతీయ స్థాయిలో వెటరన్ అథ్లెటిక్ క్రీడల్లో బంగారు పతకాలు సాధించి వారెవ్వా అనిపించారు. జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి వెటరన్ క్రీడల్లో పాల్గొంటూ ఎన్నో బంగారు, వెండి పతకాలు సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చోడవరానికి చెందిన ముత్యలం లక్ష్మి(80),గణపతి సూర్యనారాయణరాజు (75) వృద్ధాప్యాన్ని జయించి ఆటల్లో అందరికీ ఆదర్శంగా నిలిచారు. వీరు బరిలోకి దిగితే ఎంతటి వారైనా తమ ముందు ఓడిపోవాల్సిందే అన్నట్లు తమ పరుగులతో విజయాలు నమోదు చేశారు.
వచ్చాడొచ్చాడు మీసాల ‘రాజు’
గణపతిరాజు సూర్యనారాయణ రాజు 1949 ఏప్రిల్‌లో విశాఖ జిల్లా యలమంచిలిలో జన్మించారు. యలమంచిలి గవర్నమెంట్ హైస్కూల్లో సెవెంత్ ఫారం చదువుకున్నారు. పాఠశాల స్థాయి నుంచీ స్కూల్‌గేమ్స్‌లో పాల్గొంటూ అనేక విజయాలు సాధించారు. చోడవరంలో నివాసం స్థిరపడ్డ ఈయన 1976లో వైజాగ్ నేవల్ డిపార్టుమెంటులో వెపన్ డిపార్టుమెంటులో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో చేస్తూ ఆలిండియా సివిల్ సెంట్రల్ ఎంప్లాయీస్ తరఫున ఆగ్రాలో హాకీ ఆడారు. అలాగే 1989 నుంచి వెటరన్ క్రీడల్లో పాల్గొంటూ విజయాలు కైవసం చేసుకుంటున్నారు. వెటరన్ క్రీడల్లో జాతీయ స్థాయి పరుగుల పోటీల్లో అయిదు సార్లు , రాష్ట్ర స్థాయిలోని 28 సార్లు ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు. సిల్వర్ పతకాలు 24 సార్లు సాధించారు. ఇటీవల భూపాల్‌లో జరిగిన జాతీయ స్థాయి వెటరన్ పరుగుల పోటీల్లో 66 నుంచి 70 ఏళ్ల విభాగంలో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు పరుగులోని, 4–400 రిలే పోటీలో తతీయ స్థానం సాధించారు. పోటీల్లో పాల్గొనడానికి ఎక్కడికి వెళ్లినా మీసాల రాజు వచ్చాడురా.. అని కొందరు. విశాఖ పులి వచ్చింది అని మరి కొందరు అంటారు.
వృద్ధాప్యం అన్న ఆలోచనే లేదు:
చిన్నతనం నుంచి బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్లం. హాకీ కూడా ఆడేవాళ్లం. ఈస్ట్రన్ నావెల్ కమెండోలో 45 విభాగంలో మూడు సార్లు ఆల్ రౌండ్ ఛాంపియన్ షిప్ సాధించాను. క్రీడల్లో పాల్గొనడం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం. నాన్న సీతారామరాజు, అమ్మ నారాయణమ్మలు ప్రోత్సహించారు. ప్రస్తుతం కుటుంబసభ్యులు, చోడవరం వాకర్స్ క్లబ్, విశాఖపట్నం మాస్టర్ అథ్లెటిక్స్వారు పోత్సహిస్తున్నారు.
–గణపతి రాజు సూర్యనారాయణరాజు, వెటరన్ క్రీడాకారుడు .
పరుగుల సునామీ ‘ముత్యం లక్ష్మి’
ముత్యం లక్ష్మి. వయసు 80. అంతర్జాతీయ స్థాయిలో పరుగు,నడక పోటీల్లో జిల్లా ఖ్యాతిని చాటారు. చోడవరంలోనే చిన్నతనం నుంచి జీవిస్తున్న ఈమె చిన్న వయస్సు నుంచి క్రీడలపై మక్కువ ఏర్పర్చుకున్నారు. జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల వరకు అనేక సార్లు వెటరన్ క్రీడా పరుగులు, నడక పోటీల్లో పాల్గొని ప్ర«థమ స్థానం, ద్వితీయ స్థానం సాధించి బంగారు, వెండి పతకాలతో సత్తా చాటారు. ముత్యం లక్ష్మి సొంత గ్రామం దేవరాపల్లి మండలం మామిడి పల్లి గ్రామం. పదేళ్లలో 25 గోల్డ్ మెడల్స్, 15 సిల్వర్ మెడల్స్ సాధించారు.
ఇండియాలో అనేక ప్రాంతాల్లో ఆడిన ఆమె మలేషియా, చైనా, గోవా,కోలంపూర్ తదితర ప్రాంతాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్ర«థమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు. ఇటీవల భూపాల్, విశాఖపట్నంలో జరిగిన వెటరన్ పోటీల్లో 75 ప్లస్ విభాగంలో 800 మీటర్లు పరుగు పోటీలో ప్రథమ స్థానం, 100 మీటర్లు రెండో స్థానం, 4– 400 రిలే పోటీలో ప్రథమ స్థానం సాధించారు. త్వరలో మలేషియా, అమెరికా, సింగపూర్‌లో జరిగే పోటీలకు ఆహ్వానం వచ్చింది.
వయస్సుతో పనేముంది
సీనియర్ సిటిజన్స్‌కు ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం.. రమ్మని ఓ స్వచ్ఛంధ సంస్థకు చెందిన మహిళలు ఆహ్వానం పలికారు. నా భర్త కొండాజీ ప్రోత్సహించారు. ఆ పోటీల్లో షాట్ పుట్, పరుగు, నడకతో పాటు పలు పోటీల్లో గెలిచాను. అప్పటి నుంచి భర్త పోత్సాహాంతో పలు పోటీల్లో పాల్గొన్నాను. ఇది 20 ఏళ్ల కిందటి మాట. మొదట్లో చీరతో బూట్లు లేకుండా పరిగెత్తే దాన్ని ,ఇప్పుడు ట్రాక్ మాత్రమే వేసుకుంటా. బూట్లు మాత్రం వేసుకోను. అనుకోకుండా 9 ఏళ్ల క్రితం భర్త చనిపోయారు. దీంతో కోలుకోలేకపోయాను. తోటివారు ధైర్యం చెప్పి మళ్లీ పోటీలకు పంపారు. వెళ్లిన ప్రతిసారీ బంగారు పతకంతో తిరిగివచ్చేదాన్ని. ప్రస్తుతం మాస్టర్ అథ్లెటిక్స్ విశాఖపట్నం వారు ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంగా వున్నాను. –ముత్యం లక్ష్మి, వెటరన్ క్రీడాకారిణి చోడవరం