పట్టుదలకుతోబుట్టువు!
‘ముగ్గురు చాలు, ఇక పిల్లలు వద్దు’ అని తల్లిదండ్రులు అనుకుంటున్నప్పుడు పుట్టిన నాలుగో బిడ్డ రాఖీ బిర్లా. అదొక్కటే కాదు, రాఖీ జీవితంలో ఇంకా అనేకమైన నాటకీయ ఘటనలు ఉన్నాయి. ఆమె అసలు పేరు రాఖీ బిద్లాన్. అయితే పదో తరగతితో రాఖీ స్కూల్ టీచర్ బిద్లాన్కు బదులుగా సర్టిఫికెట్లో పొరపాటున బిర్లా అని రాశారు. అప్పటి నుండీ ప్రతి సందర్భంలోనూ ఆమెకు -‘మీది బిర్లా ఫ్యామిలీనా?’ అనే ప్రశ్న ఎదురవడం పరిపాటి అయింది. ఢిల్లీ రాష్ట్ర చరిత్రలోనే అతి పిన్నవయస్కురాలైన మంత్రిగా ప్రస్తుత కేజ్రీవాల్ మంత్రివర్గంలో స్త్రీ, శిశు అభివృద్ధి, సామాజిక సంక్షేమం శాఖలను నిర్వహిస్తున్న 26 ఏళ్ల రాఖీ బిర్లా... రాజకీయాల్లోకి రావడం కూడా అనుకోకుండా జరిగిన పరిణామమే. స్థానిక టెలివిజన్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న సమయంలో రాఖీ, రెండు కీలకమైన వార్తాంశాలను తన చానెల్‌కు నిరవధికంగా అందించవలసి వచ్చింది. అందులో ఒకటి అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం. ఇంకొకటి నిర్భయ గ్యాంగ్‌రేప్ ఉదంతం. ఈ రెండూ ఆమె ఆలోచనా దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసి రాజకీయాల్లోకి రప్పించాయి. సమాజంలో మార్పు తేవాలనుకున్నప్పుడు సమాజానికి దూరంగా ఉండి లాభం లేదని ఆమె బలంగా విశ్వసించారు. తన విశ్వాసానికి బలం చేకూర్చుకోడానికి ఆమ్ ఆద్మీ పార్టీతో చేరారు. ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రాష్ట్ర మంత్రి పదవిని కూడా నిర్వహించిన రాజ్ కుమార్ చౌహాన్‌ను దళితురాలైన బిర్లా పదివేల ఓట్ల తేడాతో ఓడించారు.
‘‘ఈ పిల్ల మొదట్నుంచీ మమ్మల్ని ఆశ్చర్యచకితులను చేస్తూనే ఉంది’’ అంటారు రాఖీ తండ్రి భూపేంద్రసింగ్ బిద్లాన్. కడుపులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు తనపై ప్రయోగించిన గర్భస్రావ విష ఔషధాలతో పోరాడి జన్మించారీ యువతి. మున్ముందు ఎదుర్కొనబోయే ఎలాంటి పోరాటం అయినా బహుశా అంతకన్నా చిన్నదే అవుతుంది.