సెల్లో ‘తెలుగు మాట’
హైదరాబాద్: మాతృభాషలోనే సంక్షిప్త సందేశాలు, శుభాకాంక్షలు పంపుకునేందుకు అవకాశం కల్పించే మొబైల్ అప్లికేషన్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో పనిచేసే ఈ అప్లికేషన్ను ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సోమవారమిక్కడ సచివాలయంలో ఆవిష్కరించారు. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ అప్లికేషన్ను వినియోగించి తెలుగులో సందేశాలు పంపుకోవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ నాలెడ్జ్ వర్క్స్ అమలుచేస్తున్న తెలుగు విజయం ప్రాజెక్టులో భాగంగా ‘తెలుగు మాట’ పేరుతో ప్రభుత్వం ఈ అప్లికేషన్ను అందుబాటులోకి తెచ్చిందన్నారు.
ఈ అనువర్తనం యాపిల్ వారి యాప్ స్టోర్లోనూ,ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లోనూ ఉచితంగా పొందవచ్చని పొన్నాల తెలిపారు. ‘తెలుగుమాట’ ద్వారా ఐఫోన్, ఐప్యాడ్, ఆండ్రాయిడ్ ఫోన్లలోను, ఆండ్రాయిడ్ ఆధారిత సాంకేతిక పరికరాల్లోనూ అందుబాటులో ఉంటుంది. తెలుగు భాషను సాంకేతికంగా ఉపయోగించుకునే దిశలో ఇది మరొక ముందడుగు అని పొన్నాల పేర్కొన్నారు.