సంక్రాంతికి సన్నాహాలు
దాదర్, న్యూస్‌లైన్: నవీముంబైలోని వాషి ప్రాంతంలో 14, 15వ తేదీలలో నిర్వహించే సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సెక్టర్-9(ఏ) ప్రాంగణంలో తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి స్థానిక కళాకారులతో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రముఖ కళా దర్శకురాలు కేతవరపు శోభారావు ఆధ్వర్యంలో ‘దశ దిశలా కాంతి-మన తెలుగు సంక్రాంతి’ పేరిట దేశంలోని వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల విశేషాలతో ‘డ్యాన్స్ బ్యాలే’ ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా ఆటపాటలతో చిన్నారులు, మహిళలు అలరించనున్నారని నిర్వాహకులు తెలిపారు.
15వ తేదీన..
సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌కు చెందిన మనీషా కల్చరల్ ఆర్గనైజేషన్‌కు చెందిన సంగీత దర్శకుడు మధు బాపుశాస్త్రి ఆధ్వర్యంలో ‘గ్రాండ్ మ్యూజికల్ మస్తీ’ కార్యక్రమంలో సుమధుర బాల గాయకురాలు, జీ టీవీ లిటిల్ చాంప్ ప్రవస్తీ తదితరులు పాల్గొననున్నారు. అంతేకాకుండా ఈ రెండు రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాలలో ఆహూతులకు కమ్మటి భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు సమితి అధ్యక్షుడు బండి నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మాది రెడ్డి కొండారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.