సియాటిల్‌లో ఘనంగా చవితి వేడుకలు
సియాటిల్ నగరంలో ఇస్సాక్వాలోని ఉన్నత పాఠశాలలో వినాయక చవితి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయని నిర్వాహాకులు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆ వేడుకలకు ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని తెలిపారు. ప్రమద గణాలకు అది నాయకుడైన వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు భారతి సంస్థను ప్రారంభించినట్లు వెల్లడించారు. 'నిలుపు తెలుగు వెలుగు, నేర్పు తెలుగు పలుకు' అంటూ తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని ముందు తరాల వారికి అందించడమే ధేయ్యంగా ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందని చెప్పారు.
ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సుమారు ఆరుగంటల పాటు సాగిన ఆ కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందులోభాగంగా నృత్యాలు, నృత్య నాటికలు, హాస్య నాటికలు ప్రవాసాంధ్రులను రంజిపంచేశాయి. అసంఖ్యాకంగా ప్రవాసాంధ్రులు ఆ కార్యక్రమానికి విచ్చేశారని తెలిపారు. అలాగే చిన్నలు నుంచి పెద్దల వరకు సుమారు 60 మంది ప్రవాసాంధ్రులు ఆ రంగస్థలంపై తమ నటనా కౌశలాని ప్రదర్శించారని పేర్కొన్నారు.
నాట్య కళారత్న శ్రీపసుమర్తి వేంకటేశ్వర శర్మ దర్శకత్వంలో రూపొందిన సీతాస్వయంవరం కూచిపూడి నృత్యరూపకం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు భారతి నిర్వహించే తరగతులకు హాజరయ్యేందుకు పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ చేసి పుస్తకాలు అందించారు. ఆ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సహకరించిన ప్రతిఒక్కరికి ఈ సందర్భంగా నిర్వాహాకులు కృతజ్ఞతలు తెలిపారు.