నాకు ఆరుగురు ఇష్టం
ఇంటర్వ్యూ
తెలుగు సెల్యూలాయిడ్కు సరికొత్త గ్లామర్ కిక్ రకుల్ ప్రీత్‌సింగ్. కరెంట్ తీగలా కనిపించే ఈ ఢిల్లీ జవ్వని వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతూ, అందరు హీరోలకూ ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్ అనిపించుకుంటున్నారు. ఏమాత్రం రఫ్‌నెస్ లేకుండా లౌక్యంగా మాట్లాడే రకుల్ తను యాక్ట్ చేసిన హీరోల గురించి చెప్పినకబుర్లు...
సందీప్... పని రాక్షసుడు!
సందీప్ కిషన్‌ని ‘పని రాక్షసుడు’ అంటే అతిశయోక్తి కాదు. చాలా స్ట్రెస్ తీసుకుంటాడు. 24 గంటల్లో 23 గంటల 59 నిమిషాలు సినిమాల గురించే ఆలోచిస్తాడు. ఆ సీన్‌ని ఎలా చేస్తే బాగుంటుంది? అలా కాకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుంది? అని చేయబోయే సీన్ గురించి డిస్కస్ చేస్తుంటాడు. అదేంటో తను ఏం మాట్లాడినా అది సినిమాకి సంబంధించినదే అయ్యుంటుంది. సినిమాలంటే అంత ఇష్టం సందీప్‌కి.
ఆది... వెరీ కూల్!
ఆది చాలా కూల్ పర్సన్. ఎంత రిస్కీ సీన్ అయినా కానివ్వండి... కూల్‌గా ఉంటాడు. సీన్ గురించి పెద్దగా డిస్కషన్స్ ఏవీ ఉండవు. అలా వెళ్లి ఇలా చేసేస్తాడు. ఒకవేళ షూటింగ్ స్పాట్లో ఏదైనా ప్రాబ్లెమ్ వచ్చిందనుకోండి.. ఊరికే టెన్షన్ పడిపోడు. అదే సాల్వ్ అయిపోతుందిలే అంటాడు. చాలా ఈజీ గోయింగ్. అలాగని, ప్రొఫెషన్ని లైట్ తీసుకుంటాడని కాదు. పని విషయంలో చాలా సిన్సియర్.
గోపీచంద్ చాలా బ్యాలెన్స్డ్!
గోపీచంద్‌ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే కామెడీ, సీరియస్.. ఏదైనా సరే చాలా బ్యాలెన్డ్స్‌గా వ్యవహరిస్తారు. అలా ఉండటం ఒక కళే. ఆనందం వచ్చినా, బాధ వచ్చినా పట్టలేనట్టుగా ఉండేదాన్ని నేను. గోపీని చూశాకే బ్యాలెన్డ్స్‌గా ఉండటం ఎలా అనేది నేర్చుకున్నాను. ఇదనే కాదు.. గోపీచంద్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. గోపీచంద్‌తో వర్క్ చేయడం ఈజీగా ఉంటుంది.
రామ్ సూపర్ ఎనర్జిటిక్!
రామ్‌ని చాలామంది లైవ్ వైర్ అంటారు. అదెంత నిజమో తనతో పని చేసినప్పుడు తెలిసింది. మామూలుగా నేను కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాను. కానీ రామ్ సూపర్ ఎనర్జిటిక్. అలాగే స్పాంటేనియస్ కూడా. జోక్ చేయడం, ఆ వెంటనే సీరియస్ కావడం... ఇలా మూడ్ వెంటనే మార్చేయగలడు. పనిలో చాలా డెడికేటెడ్. పూనకం వచ్చినట్లే నటిస్తాడు.
రవితేజా నేనూ ఒకటే!
నాలో తనని చూసుకుంటానని రవితేజ అంటుంటారు. దానికి కారణం మా ఇద్దరి అభిరుచులూ దాదాపు కలుస్తాయి. ఇద్దరికీ జిమ్ ఇష్టం. వర్కవుట్లు ఇష్టం. ఫుడ్ హ్యాబిట్స్ కూడా దాదాపు ఒకటే. ఎనర్జీ లెవల్స్ కూడా సేమ్. లొకేషన్లో ఆయన ఉంటే మొత్తం ఎనర్జిటిక్‌గా మారిపోతుంది. ఇక కెమెరా ముందుకొస్తే అలవోకగా యాక్ట్ చేసేస్తారు.
మనోజ్ చాలా హైపర్!
షూటింగ్ లొకేషన్ సందడి సందడిగా ఉందంటే అక్కడ మనోజ్ ఉన్నట్లే. ఆయన ఎనర్జీకి కేరాఫ్ అడ్రసేమో అనిపిస్తుంది. తను చాలా హైపర్. లొకేషన్లో అందరితోనూ సరదాగా మాట్లాడతాడు. తన కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే. కానీ కెమెరా ముందుకు వెళ్లగానే ఒక్కసారిగా సీరియస్‌గా మారిపోయి, సీన్లో ఇన్వాల్వ్ అయిపోతాడు.
- డి.జి. భవాని