వారికి ‘పద్మశ్రీ’ లు రాకపోవడం దౌర్భాగ్యం
‘‘ ‘తెలుగు సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ మద్రాసులో ప్రారంభమైనా, హైదరాబాద్లో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) గా అవతరించింది. సీనియర్ నటులు ప్రభాకర్ రెడ్డి, గుమ్మడి ఆధ్వర్యంలో ‘మా’కు అంకురార్పణ జరిగింది. గతంతో పోల్చితే ఇప్పటి ‘మా’ అసోసియేషన్ చాలా యాక్టివ్గా పని చేస్తోంది. సీనియర్ నటులను గౌరవించే మంచి సంప్రదాయాన్ని తీసుకురావడం అభినందనీయం’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. సీనియర్ నటీనటులు జమున, కైకాల సత్యనారాయణలను ఆదివారం ‘మా’ ఘనంగా సన్మానించింది.
దాసరి నారాయణరావు వారిని సత్కరించి, జ్ఞాపికలు ఇచ్చారు. అనంతరం దాసరి మాట్లాడుతూ -‘‘మా’ తరఫున పదికోట్ల రూపాయలు నిధి కేటాయించి పేద కళాకారులను ఆదుకోవాలని అప్పటి ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్ను కోరినా, అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ను ఇప్పుడు అదే కోరిక కోరుతున్నా. నేను దర్శకత్వం వహించిన పలు చిత్రాల్లో జమున నటించారు.
ఆమె నిబద్ధత ఉన్న కథానాయిక. నేను దర్శకత్వం వహించిన 150 చిత్రాల్లో 75 సినిమాల్లో సత్యనారాయణ నటించారు. ఆయన చాలా చిత్రాల్లో విలన్గా నటించినా నేను తీసిన ఒక్క చిత్రంలో కూడా విలన్ పాత్ర చేయలేదు. పౌరాణిక పాత్రల్లో ‘నువ్వే నా శిష్యుడు’ అని సత్యనారాయణను ఎస్వీ రంగారావుగారు అనేవారు. జమున, అంజలీ దేవి, ఎస్వీ రంగారావు, సావిత్రి వంటి మహానటులందరికీ ‘పద్మశ్రీ’ అవార్డులు రాలేదంటే అది మన దౌర్భాగ్యం.
ప్రభుత్వాలు ప్రతిభను గుర్తించకుండా సిఫారసు చేసిన వారికే ఇటువంటి అవార్డులు ఇవ్వటం బాధాకరం. ముక్కూ మొహం తెలియనివాళ్లకి అవార్డులు ఇవ్వడం వల్ల వాటి విలువ పడిపోయింది’’ అని ఆగ్రహావేదనలను వ్యక్తం చేశారు. జమున మాట్లాడుతూ -‘‘నా యాభై ఏళ్ల నట ప్రస్థానంలో గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీలు ఎన్నో చూశా. కానీ, ‘మా’ కుటుంబ సభ్యుల మధ్య సన్మానం జరగడం ఆనందంగా ఉంది.
మన కథానాయకులు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుగారు మన కళ్ల ముందే మనల్ని వీడి వెళ్లారు. యువతరం నటులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధపెట్టింది. రాజేంద్రప్రసాద్, శివాజీరాజా డైనమిక్ లీడర్షిప్లో ‘మా’ కమిటీ మరిన్ని మంచి పనులు చేయాలి’’ అని చెప్పారు. సత్యనారాయణ మాట్లాడుతూ- ‘‘సినిమా పూర్తయ్యాక సీనియర్లను పిలిచి ప్రివ్యూ చూపించే సంప్రదాయం గతంలో మద్రాసులో ఉండేది.
సినీ పరిశ్రమ హైదరాబాద్కొచ్చాక ప్రివ్యూలు, సన్మానాలకు సీనియర్లను పిలవకపోవడం, గౌరవించకపోవడం బాధగా అనిపించింది. సీనియర్లను ‘మా’ గుర్తించి గౌరవించడం ఆనందాన్నిస్తోంది. ఇప్పటి వరకూ 772 చిత్రాల్లో చేశా’’ అన్నారు. ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి శివాజీ రాజా తదితర ‘మా’ సభ్యులు పాల్గొన్నారు. గీతాంజలి, సంగీత, అన్నపూర్ణ, శ్రీలక్ష్మి, తనికెళ్ల భరణి, విజయ్ చందర్, శివకృష్ణ, నరేశ్, మాదాల రవి, కిరణ్, బెనర్జీ, తదితర సీనియర్ నటీనటులతో పాటు నేటి తరం ప్రముఖ తారలు మంచు విష్ణు, మంచు మనోజ్, శ్రీకాంత్, లక్ష్మీ ప్రసన్న, రాజేశ్వరి, హేమ, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.