గుత్తి వంకాయ కూరకు ఫిదా
కమ్మని అరకు కాఫీ..కాకినాడ కాజా
రుచులను ఆస్వాదించిన వైనం
అరకు కాఫీ, జీసీసీ ఉత్పత్తులు, గుత్తి వంకాయ కూర, పూత రేకులు, కాకినాడ కాజా.. ఇంకా మరెన్నో వంటకాలు నగరంలో శుక్ర, శనివారాల్లో నిర్వహించిన రహదారుల జాతీయ భద్రతా సదస్సుకు హాజరైన దేశ విదేశీయులను నోరూరించాయి. వీటి రుచి చూసిన వారు కొసరి కొసరి వడ్డించుకొని తిన్నారు. మన సంస్కతి, సంప్రదాయాలతో పాటు తెలుగు వంటకాల రుచులను ఆస్వాదించారు. కమ్మని కాఫీని, గుత్తు వంకాయను మర్చిపోలేమని లొట్టలేసుకుని మరీ లాగించేశారు. ఇక్కడ చెక్కతో తయారీ చేసిన వస్తువులను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. –బీచ్‌రోడ్
బటర్ చికెన్ బాగుంది
మా దేశంలో వంటకాల్లో బాబిక్యూ, కాఫీకి మంచి గుర్తింపు ఉంది. నేను ఈ రెండు రోజులు ఇక్కడి వంటకాలు రుచి చూశాను. చాలా బాగున్నాయి. అందులో ముఖ్యంగా బటర్ చికెన్ బాగా నచ్చింది.
–చికా సాక్షితా, ఆస్ట్రేలియా
మసాల వంటలు అలవాటు లేదు
ఇక్కడ వంటకాల్లో మసాల ఎక్కువగా ఉంది. మా దేశంలో ఆహారంలో అసలు మషాలా ఉండదు. ఇక్కడ ఏర్పాటు చేసిన వంటకాల్లో చేపల ఫ్రై బాగా నచ్చింది. అన్ని వంటకాల రుచి చూశాను.
–జార్జి స్టూవర్ట్, న్యూజిలాండ్
మా రాష్ట్రంలో 26 గిరిజన తెగలున్నాయి
మా రాష్ట్రం రకరకాల సంప్రదాయాలకు నిలయం. 26 తెగల గిరిజనులు నివసిస్తుంటారు. వారు వివిధ ఆచారాలు పాటిస్తారు. ఎక్కువ మంది కాల్(లుంగి), స్త్రీలు పురాతన ఆభరణాలు ధరిస్తారు. మా ప్రజల్లో టిబెట్ దేశ సంస్కతి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వండిన వంకాయ కూర భలే రుచిగా ఉంది.
–రిమార్ గాబ్, అరుణాచల ప్రదేశ్
వనదేవతను ఆరాధిస్తాం
మా రాష్ట్రంలో ఆస్తి కుమారులు కాకుండా కుమార్తెలకు చెందుతుంది. పిల్లలు పేరు తరువాత తల్లి పేరు వస్తుంది. మాది పూర్తిగా గిరిజన ప్రాంతం. ప్రధానంగా కశసి, గోరా అనే రెండు తెగల వారు ఉన్నారు. వనదేవతను ఆరాధిస్తాం.
–లిమిసొన్ సనగ్మా, మేఘాలయ
మసాల దోసె అంటే చాలా ఇష్టం
మషాల దోస అంటే చాలా ఇష్టం. ఈ రెండు రోజులు ఉదయం కేవలం ఇవే తిన్నాను. మాది ఎడారి ప్రాంతం కావడంతో ప్రజలు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరిస్తారు. దాల్పట్టి, జొన్న రొట్టే ఆహారంగా తీసుకుంటారు.
– నిధి సింగ్, రాజస్థాన్