రియాద్‌లో తెలుగువాళ్ల సందడి
రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్‌లో గల తెలుగు కళా క్షేత్రం ఆధ్వర్యంలో ఘనంగా సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు జరిగాయి. తెలుగువారికోసం ఈ సంస్థ ఏర్పాటుచేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఇందులో ముఖ్య అతిథులుగా భారత్ నుంచి ప్రముఖ తెలుగు గాయకుడు సింహా, కమేడియన్ వేణు(జబర్దస్త్), మిమిక్రీ కళాకారుడు నర్సింహామూర్తి హాజరై అతిథులందరిని అలరించారు. స్థానిక గాయకుడు అంజద్ హుస్సేన్ కూడా కొద్ది సేపు పాటలతో హుషారెత్తించారు.
ప్రత్యేక అతిథులుగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ జెద్ధా(తాజ్) అధ్యక్షుడు మస్తాన్, మహిళా విభాగం కార్యదర్శి విజయలక్ష్మి, అంజద్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు కళాక్షేత్రం అధ్యక్షుడు పీ వేణుమాదవ్ మాట్లాడుతూ గత పదేళ్లలో వారు చేసిన వివిధ సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు వివరించారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో పసందైన విందు కూడా ఏర్పాటు చేశారు. వందలాది ప్రవాసీ తెలుగు కుటుంబాలు వినోద కార్యక్రమాల్లో పాల్గొని సరదాగా గడిపారు.