తెలుగోళ్ల పార్టీ!
తెలుగు మక్కల్ కట్చి ఆవిర్భావం
తెలుగు సంక్షేమ లక్ష్యంగా తీర్మానాలు
రాందాసు నేతృత్వంలోని కూటమిలో చేరిక
తమిళనాడులోని తెలుగు వారి సంక్షేమం లక్ష్యంగా మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలుగు మక్కల్ కట్చి పేరిట ఆవిర్భవించిన ఈ పార్టీ తెలుగు వారి హక్కుల కోసం ఉద్యమిస్తుందని పీఎంకే నేత రాందాసు ప్రకటించారు. పీఎంకే నేతృత్వంలోని సోషియల్ డెమాక్రటిక్ అలయన్స్(ఎస్డీఏ) కూటమిలోకి ఈ తెలుగు పార్టీ చేరింది.
సాక్షి, చెన్నై:
రాష్ట్రంలోని విరుదునగర్, సేలం, దిండుగల్, తేని, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లోని యాభై శాతం మేరకు తెలుగు సంతతికి చెందిన వారు ఉన్నారు. మదురై, కోయంబత్తూరు, నామక్కల్, కడలూరు, కాంచీపురం, తిరువళ్లూరు, వేలూరు, చెన్నై, తూత్తుకుడి, విల్లుపురం జిల్లాల్లో 30 శాతం మేరకు తెలుగు వారు నివసిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో తమిళుల తర్వాత రెండో స్థానంలో తెలుగు వారే ఉన్నారు. ఇక్కడ స్థిరపడిన అనేక కుటుంబాలు తమిళులతో మమేకం అయినా, మాతృ భాషను మాత్రం మరవడం లేదు. తెలుగు చదవడం రాయడం రాకున్నా...అనేక చోట్ల తెలుగులోనే మాట్లాడుకునే కుటుంబాలు ఎన్నో. అయితే, రాష్ట్రంలో తెలుగు వారు అల్ప సంఖ్యాకులే. రాష్ర్టంలో తెలుగును రక్షించుకునే రీతిలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. అదే సమయంలో ఎన్నికల వేళ పార్టీలూ పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే తెలుగు వారి సంక్షేమ నినాదాస్త్రంతో రాష్ట్రంలో కొన్ని పార్టీలు ఆవిర్భవించినా, తెలుగోళ్లకు ఒరిగింది శూన్యమే. తాజాగా అదే నినాదంతో మరో కొత్త పార్టీ తెర మీదకు వచ్చింది. ఎన్నికల వేళ కోయంబత్తూరు వేదికగా తెలుగు మక్కల్ కట్చి ఆవిర్భవించింది.
తెలుగు మక్కల్ కట్చి: రాష్ర్టంలోని కుల సంఘాలను, పార్టీలను కలుపుకుని సోషియల్ డెమాక్రటిక్ అలయన్స్(ఎస్డీఏ) కూటమిని బలోపేతం చేసే పనిలో పీఎంకే నేత రాందాసు ఉన్న విషయం తెలిసిందే. నెల వ్యవధిలో అనేక సంఘాలను చీల్చి రాజకీయ పార్టీల ఏర్పాటులో రాందాసు బిజీబిజీగా ఉన్నారు. తాజాగా రాష్ట్రంలో రెండో జాబితాలో ఉన్న తెలుగు వారి మీద ఆయన దృష్టి పడ్డట్టుంది. తెలుగు వారి సంక్షేమాస్త్ర నినాదంతో కోయంబత్తూరు వేదికగా తన స్వహస్తాలతో తెలుగు మక్కల్ కట్చి జెండాను పరిచయం చేశారు. కోయంబత్తూరుకు చెందిన తెలుగు సంతతికి చెందిన సీజే రాజ్‌కుమార్ నేతృత్వంలో తెలుగు మక్కల్ కట్చిని ఆవిర్భవించారు. రాష్ట్రంలో తెలుగును రెండో అధికార భాషగా ప్రకటించాలని, తెలుగు వారి సమస్యల్ని పరిష్కరించాలని, పీఎంకే నినాదం సంపూ ర్ణ మద్య నిషేదం అమలు లక్ష్యంగా తెలుగు మక్కల్ కట్చి ఆవిర్భావ వేడుకలో తీర్మానాలు చేశారు.
రాం దాసు ప్రసంగిస్తూ, రాష్ర్టంలో తెలుగు వాళ్లు అత్యధికం గా ఉన్నారని గుర్తు చేశారు. పలు కులాల పేరిట ఇక్కడ తెలుగు వారు స్థిరపడి ఉన్నారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం మేరకు తెలుగు వారు ఉన్నట్టు జనాభా లెక్కల్లో తేలిందన్నారు. అయితే, తెలుగు వారి అభివృద్ధికి పాలకులు చేసిందేమీ లేదని విమర్శించా రు. అల్ప సంఖ్యాకులుగా అనేక సమస్యలతో తెలుగు వారు ఇక్కడ కొట్టుమిట్టాడుతున్నారుని వివరించారు. అందుకే తెలుగు సంక్షేమ నినాదంతో రాజకీయ బలం చేకూరే విధంగా ఈ పార్టీని ఏర్పాటు చేశామన్నారు. ఈ పార్టీ తమ కూటమిలోకి చేరినట్టు ప్రకటించారు.