తెలుగు కథలు జీవిత సవుస్యలకు దర్పణం
ఖైరతాబాద్, న్యూస్‌లైన్: వర్తమాన ఆకాంక్షలకు, జీవిత సమస్యలకు, రాజకీయ ఆర్థిక సామాజిక పరిణామాలకు తెలుగు కథ దర్పణం పడుతోందని సుప్రసిద్ధ రచయిత, చిత్రకారులు శీలా వీర్రాజు అన్నారు. సోమవారం సాయంత్రం రంజని తెలుగు సాహితీ సమితి ఆధ్వర్యంలో ఏజీ ఆఫీసు ఆరుబయట రంగస్థలంలో 2013 రం జని నందివాడ భీమారావు కథల పోటీ విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమానికి ఆయు న ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలకు చెందిన రచయితలు తెలుగు కథను పరిపుష్టం చేస్తున్నారని చెప్పారు. పదేళ్ల క్రితం అవార్డును ఏర్పాటుచేసిన రచయిత నందివాడ భీమారావు మాట్లాడుతూ కథల పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని.. గతేడాది ఆస్తమించిన తన శ్రీమతి నందివాడ శ్యామల సాహితీ పురస్కారాన్ని ఈ ఏడాది రచయిత్రి జ్వలితకు ప్రదానం చేయడం మరింత ఆనందంగా ఉందన్నారు. పోటీలు కొత్తవారిని బాగా ప్రోత్సహిస్తాయని, రంజని వాటిని క్రమం తప్పకుండా నిర్వహించడం అభినందనీయమని జ్వలిత చెప్పారు.
విజేతలు వీరే..
నందివాడ భీమారావు కథల పోటీలో మొదటి బహుమతిగా రచయిత ఆర్. కశ్యప్ (రామదుర్గం మధుసూదనరావు) రాసిన ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ’ కథ ఎంపికైంది. రచయితకు బహుమతిగా రూ. 4వేలు అందజేశారు. రెండవ బహుమతిగా రచయిత పి. శ్రీనివాస్‌గౌడ్ రాసిన ‘మార్జినోళ్ళు’ గెల్చుకుంది. నగదు బహుమతి రూ. 3వేలు అందజేశారు. మూడో బహుమతిని రంగనాధ రామచంద్రరావు సొంతం చేసుకున్నారు. నాల్గో స్థానంలో ఉపేందర్ రాసిన ‘జ్ఞాపకం’ నిల్చింది. రంజని అధ్యక్షుడు సుందరయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రంజని ప్రధాన కార్యదర్శి మట్టిగుంట వెంకటరమణ, ఉపాధ్యక్షుడు నంద్యాల మురళీకృష్ణ, కోశాధికారి ఆదిశేషు పాల్గొన్నారు.