టెక్సాస్‌లో ఘనంగా తెలుగు వైభవం కార్యక్రమం
టెక్సాస్: తెలుగు వైభవం, నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమాలను ఉత్తర టెక్సాస్ సంఘం(టాంటెక్స్) టెక్సాస్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాలకు పలువురు విశిష్ట అతిధులు హాజరయ్యారు. 120 నెలల పాటు వరుసగా సాహిత్య సదస్సులు నిర్వహించిన ఘనత టాంటెక్స్‌కు ఉంది. ప్రముఖ సాహితీవేత్తలను ఆహ్వానించి వారి సమక్షంలో టాంటెక్స్ ఈ సదస్సులను నిర్వహిస్తుంది.
ఈ నెల 8వ తేదీన జరిగిన తెలుగు వైభవం 10వ వార్షికోత్సవం , తెలుగు వెన్నెల కార్యక్రమాలకు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, సింగిరెడ్డి శారద, పలువురు సాహితీ ప్రియులు హాజరయ్యారు. సాహిత్య వేదిక సమన్వయ కర్త సింగిరెడ్డి శారద 2017లో జరిగిన సాహిత్య కార్యక్రమాల మీద మాట్లాడారు. ప్రొ. వీ దుర్గాభవాని తెలుగుసాహిత్యం మీద, దాసరి అమరేంద్ర 'తెలుగు యాత్రా సాహిత్యం' అనే అంశాలపై ప్రసంగించారు.
డా.కాత్యాయని విద్మహే, వాసిరెడ్డి నవీన్, డా.కందిమళ్ల సాంబశివరావు, గొర్తి బ్రహ్మానందం, మెర్సీ మార్గరెట్, నశీం షేక్, కేవీ సత్యనారాయణ, ఆదిభట్ల మహేష్ ఆదిత్య తదతరులు కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. గాయని సునీత, వందేమాతంర శ్రీనివాస్, భార్గవి పిళ్లై, దినకర్, యాసిన్ నజీర్, సమీర భరద్వాజ్‌లు సంగీతంతో అలరించారు.