ఆటాడుకుందాం..రా
వలంటీర్ల తరహాలో పీఈటీలు ∙జిల్లాలో 275 మంది నియామకం
పాపన్నపేట:ఒలింపిక్ క్రీడా ఫలితాలు అధికారుల కళ్లు తెరిపించాయి. జనాభా పరంగా ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారత్ ఒలింపిక్ క్రీడల్లో ఉనికి చాటుకునే ప్రయత్నంలో రెండు పతకాలు సాధించడం కొంతలో కొంత ఊరట కలిగించింది. ముఖ్యంగా రెజ్లింగ్‌లో సాక్షిమాలిక్ కాంస్యం, బ్యాడ్మింటలో తెలుగు తేజం సింధు రజత పతకం పొంది.. పోరాడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. ఈ తరహా ‘సక్సెస్ ఆటిట్యూడ్’ను చిన్నప్పటి నుండే పిల్లలకు నేర్పాలన్న సందేశాన్ని వీరు సాధించిన విజయం అందించింది. దీంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పీఈటీలను నియమించి గ్రామీణ స్థాయి నుంచే మెరికల్లాంటి క్రీడాకారులనుతీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.
వందకు పైగా విద్యార్థులున్న స్కూళ్లలో వలంటీర్ పీఈటీలను నియమించేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఆటలు అటకెక్కాయి..మెదక్ జిల్లాలో మొత్తం 508 ఉన్నత పాఠశాలలు, 416 ప్రాథమికోన్నత, 1,907 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం అన్ని ప్రాథమికోన్నత పాఠశాలల్లో పీఈటీలు, ఆట స్థలాలు ఉండాలి. కాని మెదక్ జిల్లాలో 759 పాఠశాలలకు మైదానాలు లేవు. మొత్తం 162 మంది పీఈటీలు, 63 ఫిజికల్ డైరక్టర్లు ఉండగా మిగతా పాఠశాలల్లో పీఈటీలు లేరు. దీంతో వేలాది మంది విద్యార్థులను ఆటలాడించే పరిస్థితి లేదు.
మొక్కుబడిగా క్రీడలు..
ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో క్రీడలకు పీరియడ్లు కేటాయించాలి. కాని చాలా చోట్ల పీఈటీలు, వసతులు లేక ప్రత్యేక పీరియడ్లు కేటాయించడం లేదన్న విమర్శలున్నాయి. కేవలం 15 ఆగస్టు, 26 జనవరికి మాత్రమే మొక్కుబడిగా ఆటలాడిస్తున్నట్లు సమాచారం. అప్పట్లో మండల స్థాయి టోర్నమెంట్లు జరిగేవి. కాని ప్రస్తుతం పైకా (పంచాయతీ యువ ఖేల్ అభియా¯ŒS) పేరిట క్రీడాకారుల ఎంపికలు మాత్రమే జరుగుతున్నాయి. అలాగే క్రీడల కోసం ప్రత్యేక నిధులు పాఠశాలలకు మంజూరు కావడం లేదు. ఉన్నత పాఠశాలలకు ఆర్‌ఎంఎస్‌ఏ కింద ఏటా వచ్చే రూ.7,500లలో లైబ్రరీ పుస్తకాలు, క్రీడా సామగ్రి కొనుగోలుకు అవకాశం ఉంది.
వంద మంది విద్యార్థులు దాటితే పీఈటీ
క్రీడలకు పెద్దపీట వేసే లక్ష్యంతో మొదట వంద మందికి పైగా విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో వలంటీర్ పీఈటీలను నియమించాలని పాఠశాల విద్యా డైరక్టర్ కిష¯ŒS ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో సుమారు 275 మంది పీఈటీలు నియామకమయ్యే అవకాశం ఉంది. సెస్టెంబర్ 1 కల్లా వీరిని నియమించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఆటలకు నిధులు కేటాయించాలి: పీడీ శ్రీధర్‌రెడ్డి
ప్రతి పాఠశాలలో ఆటలకు నిధులు మంజూరు చేయాలి. క్రీడలకు ఒక పీరియడ్ విధిగా కేటాయించాలి. ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలకు పీఈటీని నియమించాలి. మండల స్థాయి టోర్నమెంట్లు నిర్వహించాలి.
ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండాలి: మధు, పీఈటీ
క్రీడాకారులకు ఉద్యోగాల్లో, ప్రొఫెషనల్ కోర్సుల్లో రిజర్వేషన్లు కల్పించాలి. ప్రభుత్వం తరపున క్రీడా సామగ్రి పంపిణీ చేయాలి. మండల స్థాయిలో స్టేడియంలు నిర్మించి, కోచ్‌లను నియమించాలి.