తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు
పీలేరు, న్యూస్‌లైన్: పదవుల కోసం పాకులాడుతున్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని పీలేరు జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శనివారం పీలేరు అంబేద్కర్ సర్కిల్ నుంచి సమైక్యాంధ్ర ఉద్యమంలో మేము సైతమంటూ వికలాంగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హైవే కూడలి అయిన క్రాస్ రోడ్డులో పలువురు జేఏసీ నేతలు ఉద్యమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంపై కనీస అవగాహన లేని సోనియాగాంధీ తన రాజకీయ స్వలాభం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు.
ఈ ప్రాంతం ఆరు కోట్ల సీమాంధ్రుల జీవితాలతో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేస్తే సీమాంధ్రలో పనిచేస్తున్న ఉద్యోగులకు నెల జీతం కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగం కుంటుపడుతుందని, తద్వారా లక్షలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే మరో పదేళ్ల పాటు సీమాంధ్రలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్, ఇతర ఉన్నత చదువులు చదువుతున్న నిరుద్యోగ యువతీ యువకుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పారిశ్రామికంగా ఎంతో పురోభివృద్ధి సాధించిన హైదరాబాద్‌ను వదులుకుంటే ఈ ప్రాంత నిరుద్యోగుల జీవితాలు అంధకారంగా మారుతాయన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో జేఏసీ నాయకుల తోపాటు ఆదర్శ వికలాంగుల సంక్షేమ సంఘం, ఆటో యూనియన్ నేతలు, ఆర్టీసీ కార్మికులు, వివిధ కుల సంఘాలు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, పీలేరు సర్పంచ్ ఏఎస్. హుమయూన్, మహిళా సంఘాలు, వ్యాపారులు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.