temple authority
-
రాజమౌళన్నా.. కూర ప్రభాకర్ ఏం జేస్తుండు: సీఎం కేసీఆర్
సాక్షి, దుబ్బాక టౌన్: ‘దుబ్బాకకు రాక చాలా రోజులు అవుతోంది. మనోల్లంతా బాగున్నరా రాజమౌళన్నా.. కూర ప్రభాకర్ ఏం జేస్తుండు.. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. బాలాజీ ఆలయ ప్రారంభోత్సవంలో తప్పకుండా పాల్గొంటా.. ఆ రోజు అందరినీ కలుస్తా..’అంటూ ఆహ్వాన పత్రిక అందజేయడానికి ప్రగతి భవన్‌కు వచ్చిన దుబ్బాక నాయకులతో సీఎం కేసీఆర్ ముచ్చటించారు. శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి దుబ్బాక బాలాజీ ఆలయ కమిటీ బాధ్యులు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆగస్టు 20న ఆలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణ చిత్రాలు చూశానని, చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. దుబ్బాక బాలాజీ ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచుతుందని చెప్పారు. నిర్మాణం పూర్తయ్యాక చినజీయర్ స్వామితో కలసి ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకుందామని సీఎం వివరించారు. ఈ సందర్భంగా వారిని పేరుపేరున పలకరించడంతో పాటు దుబ్బాకలో తన చిన్ననాటి మిత్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు వడ్లకొండ సుభద్ర శ్రీధర్, చింత రాజు, రొట్టె రాజమౌళి, మధు, కూర వేణుగోపాల్, శ్రీనివాస్ తదితరులున్నారు. -
యాదాద్రిలో గాడి తప్పిన పాలన..!
యాదాద్రి దేవస్థానంలో పాలన గాడి తప్పింది. తప్పులపై తప్పులు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. రిటైర్డ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ కావడం అధికారుల అలసత్వాన్ని తేటతెల్లం చేస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రిలో అధికారుల పనితీరును చూసి భక్తులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. యాదగిరికొండ (ఆలేరు) : యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. కోట్లు వెచ్చించి ఆలయాన్ని దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇక్కడి అధికార యంత్రాంగం మాత్రం విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగ విరమణ పొందినా.. దేవస్థానంలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి గత సెప్టెంబర్‌లో ఉద్యోగ విరమణ పొందాడు. అయితే సంబంధిత సెక్షన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ రిటైర్డ్ ఉద్యోగి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో రెండు నెలల వేతనం జమ అయ్యింది. ఇటీవల గుర్తించిన సదరు విభాగం అధికారులు సదరు రిటైర్డ్ ఉద్యోగిని పిలిపించి వేతన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా అతడు నిరాకరించడంతో విషయం కాస్తా బయటికి పొక్కింది. గతంలోనూ.. ఇలాంటి ఘటనలు దేవస్థానంలో కొత్తేమి కాదని గత రికార్డులు పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది. గతంలో దేవస్థానంలో స్వీపర్‌గా పనిచేసిన ఉద్యోగి ఖాతాలో కూడా ఆరు నెలల వేతనం జమ అయింది. అదే విధంగా మరో ఉద్యోగికి అదనంగా ఇంక్రిమెంట్ కలిపిన ఘటనలు దేవస్థానంలో వెలుగుచూశాయి. అయినా కూడా సదరు విభాగం అధికారుల తీరులో మాత్రం నిర్లక్ష్యం ఇంకా కనిపిస్తోందని తాజా ఘటనే రుజువు చేస్తోంది. ఏళ్లకు ఏళ్లుగా.. సహజంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు బదిలీలు సహజం. మహా అయితే మూడు, నాలుగు సంవత్సరాలకు ఉద్యోగుల బదిలీలు జరుగుతుంటాయి. కానీ, దేవస్థానంలో ఓ స్థాయి ఉద్యోగి మాత్రం ఏకంగా రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడే విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. కిందిస్థాయిలో ఏ చిన్న తప్పు జరిగినా వెంటనే ఉన్నతాధికారులకు తెలిసిపోతోంది. ప్రసిద్ధ ఆలయంలో ఉద్యోగుల నిర్లక్ష్యం కనిపిస్తున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. కాగా, దేవస్థానంలో వెలుగుచూసిన ఘటనలపై వివరణ కోరేందుకు ఆలయ ఈఓ పలుమార్లు ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించినా ఆమె అందుబాటులోకి రాలేదు. -
ఎవరింట్లో పెళ్లనుకుంటున్నారు?
► యాదాద్రి లక్ష్మీనరసింహుడి కల్యాణం ఆలస్యంపై గవర్నర్ నరసింహన్ ఫైర్ ► సమయం ఎందుకు పాటించడం లేదంటూ ఆలయ ఈవోపై మండిపాటు ► సమయం ప్రకారం జరపరా అంటూ ఆగ్రహం ► మాంగళ్య ధారణ పూర్తవకముందే అర్ధంతరంగా హైదరాబాద్‌కు తిరుగుపయనం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి హాజరైన రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఎప్పుడూ భక్తిశ్రద్ధలతో, దైవ కార్యక్రమాలను తు.చ. తప్పకుండా పాటించే గవర్నర్.. సతీసమేతంగా లక్ష్మీనరసింహుడి కల్యాణ వేడుక నుంచి మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. యాదగిరీశుడి కల్యాణం ముహూర్త సమయాని కన్నా ఆలస్యంగా జరుగుతుందన్న కారణంతో ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని, కొంతసేపు కూర్చుని ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారని తెలుస్తోంది! అసలేమైందంటే..? గవర్నర్ నరసింహన్ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు గురువారం రాత్రి 8:30 గంటలకు సతీసమేతంగా యాదాద్రికి వచ్చారు. కల్యాణం జరిగే మండపంలో ఆశీనులై పెళ్లి తంతును తిలకించారు. అయితే, ముహూర్తం ప్రకారం స్వామి వారి ఉరేగింపు 9:45 గంటలకు కల్యాణ మండపానికి రావాల్సి ఉంది. కానీ 18 నిమిషాలు ఆలస్యంగా 10:03 నిమిషాలకు వచ్చింది. దీంతో గవర్నర్ నరసింహన్ ఆలయ ఈవో గీతారెడ్డిని ఆలస్యం ఎందుకు అయిందని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరికొందరు ప్రజాప్రతినిధులు రావాల్సి ఉందని, అందుకే పావుగంట ఆలస్యంగా కల్యాణం నిర్వహిస్తున్నామని ఈవో బదులిచ్చినట్టు సమాచారం. దీంతో గవర్నర్ నరసింహన్ ఆలయ ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇష్ట ప్రకారం చేయడానికి ఎవరింట్లో పెళ్లనుకుంటున్నారు? అన్నీ సమయం ప్రకారం ఎందుకు జరపడం లేదు? అని ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో ఈవో గీత వెంటనే పూజాది కార్యక్రమాలను ప్రారంభించాలని అర్చకులకు సూచించారని తెలుస్తోంది. ఎవరో రావాలన్న ఆలోచనతో స్వామివారి కల్యాణాన్ని ఆలస్యంగా చేస్తున్నారనే కారణంతో నరసింహన్ తన సతీమణితో కలిసి 10:45 గంటల సమయంలో కల్యాణ వేడుక నుంచి అర్ధంతరంగా లేచి వెళ్లిపోయారు. గవర్నర్ వెళ్లే సమయానికి మాంగళ్య ధారణ కార్యక్రమం కూడా పూర్తి కాకపోవడం, పెళ్లికి వచ్చిన దుస్తులతోనే ఆయన వాహనంలో ఎక్కి వెళ్లిపోయారు. గవర్నర్ వెళ్లిన తర్వాత 40 నిమిషాలకు అంటే 11: 25 నిమిషాలకు స్వామి వారి కల్యాణ ఘట్టం ముగియడం గమనార్హం. రాయగిరి కట్ట మీద ఉన్న మైసమ్మ దేవాలయం వద్ద తన వాహనశ్రేణిని ఆపిన గవర్నర్ అక్కడ దుస్తులు మార్చుకుని హైదరాబాద్ వెళ్లినట్టు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.