శరణాలయాలకు శ్రీకారం ఎప్పుడో
కాలిబాటలు.. గుడి మెట్లు.. ఓవర్ బ్రిడ్జిల దిగువన.. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో.. బతుకు పడమటి పొద్దున చావు కోసం నిరీక్షించే వృద్ధులెందరో కనిపిస్తుం టారు. వీరంతా వయసులో ఉన్నప్పుడు తమ జవసత్వాలను వినియోగించి ఏదో రూపంలో సమాజ గమనానికి తమ వంతు సహకారం అందించిన వారే. తమ పొట్ట తాము పోసుకున్నవారే. జీవన సంధ్యలో రోజు గడవటం వారికి గగనమైంది. అవసరాలను తీర్చే ఆత్మీయతకు దూరమయ్యారు. అయిన వారికి భారమయ్యారు. తమ రెక్కల కష్టంతో రక్తాన్ని చెమటగా మార్చి.. పెంచి పోషించిన బిడ్డలే నిరాదరించగా, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి యాచిస్తూ తమంతట తాము చావలేక మృత్యువు కరుణించే క్షణాల కోసం నిరీక్షించే వృద్ధుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కని, పెంచిన తల్లిదండ్రులకు చరమాంకంలో ఇంత బువ్వ పెట్టి పసిపిల్లల్లా సాకాల్సిన కొడుకులు, కూతుళ్లు కర్కశ హృదయులుగా మారడానికి పేదరికమే ప్రధాన కారణమన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే పేదలందరూ కన్న ారిని ఇలా రోడ్ల పాలు చేయకపోవచ్చు. అలా అని స్థోమత ఉండీ వృద్ధులను వృథా జీవులుగా పరిగణించేవారూ లేకపోలేదు.
సంపన్నులైన వృద్ధు లు సొమ్ము చెల్లించి వృద్ధాశ్రమాలకు వెళ్తున్నారు. మరి పేదరికంలో మగ్గుతున్న వృద్ధుల మాటేమిటి? వీరు నేడు నిస్సహాయులుగా మారిపోవచ్చు. వారంతా ఒకప్పుడు సమాజ గమనానికి తమ శక్తిని ధారపోసి నేటి జీవితానికి పునాదులు నిర్మించిన వారనే నిజాన్ని గుర్తించి వృద్ధులను గౌరవించాల్సిన బాధ్యత వారి బిడ్డలపైనే కాదు సమాజంపైనా ఉంది. ఈ బాధ్యత పాలకులపై మరీ ఎక్కువ. చంద్రబాబు సర్కారు ఇటువంటి సమాజ బాధ్యతనే నెత్తిన వేసుకున్నామని ఘనంగా ప్రకటించింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున వృద్ధుల శరణాలయాలు నిర్మించాలని తలపోసింది. చంద్రబాబు మూడునెలల కిందట జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఈ మేరకు ప్రకటన చేశారు. ఆ తరువాత విధివిధానాల ప్రకటన రాలేదు. కానీ గనులు, మహిళా, శిశు సంక్షేమ, మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి పీతల సుజాత ఇటీవలే ఈ శరణాలయాల విషయం ప్రస్తావించారు. కానీ ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా అనేది స్పష్టం చేయలేదు. అన్ని నియోజకవర్గాల్లోనూ గెలిపించిన సెంటిమెంట్‌తో మన జిల్లాలోనే ఈ ప్రకటన చేసినట్టుగానే ఈ వృద్ధుల శరణాలయాల ఏర్పాటు కూడా ఈ జిల్లా నుంచే మొదలైతే బాగుంటుందని అధికార పార్టీ వర్గాలూ అంటున్నాయి. మంత్రిగా పీతల సుజాత అరుునా పట్టించుకుని వృద్ధాశ్రమాల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా కార్యాచరణలోకి తీసుకు రావాలన్నదే అందరి ఆకాంక్ష.
సీసీల సిల్లీ పనులు
ఎక్కడో మీవంటి కోటికొక్కరు తప్పించి పొగడ్తలకు పడిపోనివారెవరు.. అంటూ ఓ మందిమాగధ స్త్రోత్రం ప్రతి నిత్యం మహారాజా వారిని పడగొట్టేదట. సరిగ్గా ఇలానే జిల్లాలోని పలువురు ముఖ్యనేతలు, అధికారుల వద్ద సీసీలు, పీఏలుగా పని చేస్తున్న వారు ఆయా ప్రముఖులను పొగడ్తలతో ముంచెత్తుతూ.. ప్రజలతో మీరెందుకు మాట్లాడటం.. మేం చూసుకుంటాం కదా.. అని వారికి అందరినీ దూరం చేస్తున్నారట. జిల్లాలోని ఓ కీలక అధికారి వద్ద సీసీగా పనిచేస్తున్న ఒకాయన ప్రజలతో సదరు అధికారికి నేరుగా సంబంధాలు లేకుండా అడ్డుగోడగా నిలుస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఉండే అధికారి ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియక మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే వారు సీసీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని వస్తుండటం రివాజు. ఎప్పుడో ఒకసారి ఆ అధికారి అయినా నేరుగా ఫోన్లో అందుబాటులోకి వస్తారేమో కానీ.. సదరు సీసీ మాత్రం కనీసం ఫోన్ కూడా తీయలేనంతగా ఎప్పుడూ బీజీనేననట. అదేమంటే అధికారి వెంటే ఉంటాను కాబట్టి ఫోన్లు తీయడం లేదని చెబుతుంటారు. అధికారి కోసం ఈయనకు చేస్తే ఫోన్ తీయరు. మరి ఈయన కోసం ఎవరికి చేయాలి. బహుశా.. సీసీకి ఇంకో సీసీ కావాలేమో. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు