టీఆర్ఎస్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయిన తెలంగాణ టీడీపీ
సాక్షి, హైదరాబాద్ : స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి ఎన్నికైన అధికార టీఆర్ఎస్కు చెందిన పది మంది ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలి దర్బారు హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. బాలసాని లక్ష్మీనారాయణ(ఖమ్మం), కొండా మురళీధర్‌రావు (వరంగల్), భాను ప్రసాద్‌రావు (కరీంనగర్), నారదాసు లక్ష్మణ్ రావు (కరీంనగర్-2), పురాణం సతీశ్ (ఆదిలాబాద్), డాక్టర్ భూపతిరెడ్డి (నిజామాబాద్), భూపాల్‌రెడ్డి (మెదక్), పట్నం నరేందర్‌రెడ్డి (రంగారెడ్డి), శంభీపూర్ రాజు (రంగారెడ్డి -2), కసిరెడ్డి నారాయణరెడ్డి(మహబూబ్‌నగర్)లు ప్రమాణం చేశారు.
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్రావు, కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన ఎమ్మెల్సీలను అభినందించారు. తాము స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి ఎన్నికయ్యామని, ఈ దృష్ట్యా ఆ సంస్థల సమస్యలపై పోరాడుతామని నూతన ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. కాగా, ఏపీ పునర్విభజన చట్టం మేరకు నలభై మంది సభ్యులతో ఏర్పాటైన తెలంగాణ శాసన మండలిలో ప్రస్తుతం ఒక్క స్థానం కూడా ఖాళీగా లేదు. స్థానిక సంస్థల కోటాలో మండలి ఎన్నికల తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీకి 21 మంది సభ్యులు ఉండగా టీటీడీపీకి అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.