తెనాలి నీరు తెనాలికే...
మారీసుపేట (తెనాలి) : ‘తెనాలి నీరు తెనాలికే’...అనే నినాదంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన తెనాలి బంద్ విజయవంతమైంది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొని తమ నిరసన తెలిపారు. వ్యాపారులు స్వచ్ఛందంగా తమ షాపులను మూసివేసి సంఘీభావం ప్రకటించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కూడా తమ కార్యాలయాలను మూసివేశారు.
కృష్ణా జలాల తరలింపును నిరసిస్తూ చేసిన నినాదాలతో పట్టణం మారుమోగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో, అప్పటి తెనాలి ఎంపీ వల్లభనేని బాలశౌరి తెనాలికి తీసుకువచ్చిన రక్షిత మంచినీటి పథకానికి టీడీపీ నాయకులు తూట్లు పొడుస్తున్నారని విమ ర్శించారు. మంచినీటి పథకం గురించి సోమవారం ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సత్యదూరమన్నారు.
మున్సిపాలిటీలో మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ ఏడాదికి పనుల పేరిట రూ.10కోట్లు ఆదాయం వస్తుందన్నారు. తెనాలి వస్తున్న కృష్ణా జలాలను మంగళగిరి, దుగ్గిరాల మండలాల వారు కావాలని అడుగుతున్నారని ఇలా నీటిని ఇచ్చుకుంటూ పోతే చివరకు మిగిలేది నీటి చుక్కలేనని తెలిపారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు బేషజాలకు పోకుండా వెంటనే మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీ తెనాలి నియోజకవర్గ పరిశీలకులు ఎస్.వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో భూ గర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, ముందుచూపుతో గత పాలకులు రక్షిత మంచినీటి పథకాన్ని తెనాలి తీసుకువస్తే దానిని స్వార్థ ప్రయోజనాల కోసం కోకా-కోలా కంపెనీకి తరలించాలని నిర్ణయించడం బాధాకరమన్నారు.
సీపీఎం తెనాలి డివిజన్ కార్యదర్శి ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ ఒకనాడు ప్రతి పక్షంలో ఉన్న టీడీపీ నాయకులు రక్షిత మంచినీటి పథకాన్ని త్వరగా ప్రారంభించాలని ఆందోళన చేశారని, ఆ విషయాన్ని నేడు మర్చిపోయి ప్రైవేట్ కంపెనీలకు కృష్ణా జలాలను ధారాదత్తం చేయడం వారి స్వార్థ రాజకీయాలకు నిదర్శనం అన్నారు. కాంగ్రెస్‌పార్టీ నాయకులు హరిదాస్ గౌరిశంకర్ తదితరులు మాట్లాడారు.
పట్టణంలో నిరసన ర్యాలీ ...
తొలుత అఖిలపక్షం నాయకులు మంగళవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ముందుగా మున్సిపల్ కార్యాలయాన్ని మూయించారు. అక్కడి నుంచి గాంధీచౌక్, బోస్‌రోడ్డు, కొత్తపేట మీదుగా స్వరాజ్ టాకీస్ సెంటర్ చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రదర్శనగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వెళ్లి ఉద్యోగులను బయటకు పంపించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.