పొరపాటెక్కడ జరిగింది?
► పదో తరగతి ఫలితాలపై విశ్లేషణ
► స్థానం పెరిగినా.. ఆశించింది రాలేదు
► అక్కరకు రాని సమీక్షలు
మచిలీపట్నం (చిలకలపూడి): అన్ని రంగాల్లో కృష్ణా టీం ముందుండాలన్నది కలెక్టర్ బాబు.ఎ ఆశ. ఆ ఆశకు అనుగుణంగానే నిత్యావసర సరుకుల సరఫరాలో ఈ-పోస్. పింఛన్ల పంపిణీ, మరుగుదొడ్ల నిర్మాణం, మరెన్నో పథకాలలో జిల్లా రాష్ట్రంలో ముందుండాలని అనేది కలెక్టర్ ఆలోచన. అయితే పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో తొమ్మిదో స్థానం సాధించడం ఆయనకు నిరాశ కలిగించింది. మొదటిస్థానం వైఎస్ఆర్జిల్లా దక్కించుకుంది. గత ఫలితాలు బట్టి బేరీజు వేసుకుంటే ఈసారి రాష్ట్రంలో జిల్లా తొమ్మిదో స్థానం సాధించడం, ఉత్తీర్ణత శాతం 93.11 శాతం పెరిగింది.అయితే గత ఫలితాలు, గ్రేడ్ల ఫలితాలు చూస్తే ఇవి ఆశాజనకంగా కనిపించలేదు. ఈ ఏడాది ఫలితాల్లో ప్రైవేటు పాఠశాలలు కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయాయి. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తాయనుకున్నారు.
అక్కరకు రాని సమీక్షలు
జిల్లాను రాష్ట్రంలో మెరుగైన స్థానంలో నిలిపేందుకు పరీక్షా తేదీని ప్రకటించిన నాలుగు నెలల ముందు నుంచే డీఈవో ఎ.సుబ్బారెడ్డి ఉపాధ్యాయులకు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. డివిజన్ల వారీగా ఉపాధ్యాయుల సమీక్షలు, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల సమీక్షలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. సమీక్షా సమావేశాల్లో పాఠశాలకు ఒక్క విద్యార్థి అయినా పదికి పది పాయింట్లు సాధించాలని ఆయన చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి. నాలుగుసార్లు ప్రీఫైనల్స్ పరీక్షలను కూడా నిర్వహించి వాటి మార్కుల ఆధారంగా సమీక్షలు నిర్వహించినా ఫైనల్ ఫలితాల్లో మాత్రం ఆశించినంతగా రాలేదు.
వైఫల్యాలెన్నో..
జిల్లాలో పదో తరగతి ఫలితాలు అనుకున్న స్థాయిలో రాకపోవడానికి వైఫల్యాలు ఎన్నో ఉన్నాయి. గత సంవత్సరం పదికి పది మార్కులు వచ్చిన విద్యార్థులు 646 మంది ఉండగా వీరిలో 18 మంది ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది వచ్చిన ఫలితాల్లో జిల్లా మొత్తంలో 485 మంది విద్యార్థులు పదికి పది పాయింట్లు సాధించగా వీరిలో కేవలం 11 మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులున్నారు. అలాగే గత సంవత్సరంలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల్లో 229 ఉండగా ఈ సంవత్సరం కేవలం 120 పాఠశాలలు మాత్రమే నూరుశాతం ఉత్తీర్ణత సాధించాయి. అయితే ఉపాధ్యాయుల సమీక్షా సమావేశాలు నిర్వహించినప్పుడు గతంలో కంటే ఏ-గ్రేడ్లు సాధించిన విద్యార్థుల లక్ష్యం పెంచుతామని బాహాటంగా చెప్పినప్పటికీ ఫలితాల్లో కనిపించకపోవడం ఉన్నతాధికారులను తీవ్ర నిరాశకు గురిచేశాయి.