టెన్త్ మ్యాథ్స్–1 పేపర్ లీక్
- గార్లలో బయటకొచ్చిన ప్రశ్నపత్రం
- పోలీసుల అదుపులో నిందితులు
సాక్షి, మహబూబాబాద్: పదో తరగతి పరీక్షల్లో లీకేజీ పరంపర కొనసాగుతోంది. మంగళవారం జరిగిన సప్లిమెంటరీ పరీక్షల్లో మ్యాథ్స్–1 ప్రశ్నపత్రం మహబూబాబాద్ జిల్లా గార్లలో లీక్ అయ్యింది. గార్లలోని బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం 9.30 నిమిషాలకు మ్యాథ్స్–1 పరీక్ష ప్రారంభమైంది. అరగంట తర్వాత గార్ల మండలం సింగారం గ్రామానికి చెందిన బానోత్ కార్తీక్ అనే యువకుడు పాఠశాల ప్రహరీగోడ దూకి పరీక్ష హాలులోకి వెళ్లి, అదే పాఠశాలలో పనిచేస్తున్న ఇన్విజిలేటర్ భద్రును ప్రశ్నపత్రాన్ని సెల్లో ఫొటో తీసి ఇవ్వాలని కోరారు. దీంతో ఇన్విజిలేటర్ సెల్లో ఫొటో తీసి ఇచ్చాడు. పాఠశాల నుంచి బయటకు వచ్చిన కార్తీక్ స్నేహితులకు వాట్సాప్‌లో గణితం ప్రశ్నపత్రం ఫొటోను పోస్టు చేయడంతో, గార్లలో పది గణితం ప్రశ్నపత్రం లీకైనట్లు వెలుగు చూసింది. దీంతో అప్రమత్తమైన ఎస్సై సీహెచ్.వంశీధర్ వెంటనే పరీక్షా కేంద్రానికి వెళ్లి విచారణ చేపట్టి ఇన్విజిలేటర్ భద్రు, యువకుడు కార్తీక్‌ను అదుపులోకి తీసుకొని జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
సీఐ ఎం.సాంబయ్య పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, ఇన్విజిలేటర్ భద్రు, కార్తీక్‌లను 2 గంటల పాటు విచారించగా, వారు జరిగిన విషయాన్ని పోలీసులకు వెల్లడించారు. ఈ ఏడాది వార్షిక పరీక్షలో మార్చి 21న మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఇంగ్లీష్ పేపర్–1 ప్రశ్నపత్రం లీకైంది. మళ్లీ ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలోనే ప్రశ్నపత్రం లీక్ అయింది. మార్చి 22న సూర్యాపేట జిల్లా హూజుర్‌నగర్‌లో ఇంగ్లీష్–2 ప్రశ్నపత్రం లీకైంది. గతంలో దంతాలపల్లి నుంచి ఖమ్మంకు ప్రశ్నపత్రం వాట్సాప్ ద్వారా చేరింది. ఇందుకు బాధ్యులైన వారి అరెస్ట్ చేశారు.
ముగ్గురి సస్పెన్షన్
గణితం–1 పరీక్షలో పేపరు లీకేజీకి ప్రయత్నించిన వ్యవహారంలో ముగ్గురిని సస్పెండ్ చేయడంతో పాటు ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పరీక్షా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న డిపార్ట్మెంట్ అధికారి, చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేశారు. ఇన్విజిలేటర్, సమాచారం తీసుకోవడానికి గోడ దూకి వచ్చిన వ్యక్తిపై క్రిమినల్ కేసును నమోదు చేశారు. ఫొటోలు తీసుకునేందుకు సహకరించిన విద్యార్థిని డిబార్ చేశారు. పేపర్ లీక్ కాలేదని, అధికారులు అప్రమత్తమై తగిన చర్యలను తీసుకున్నారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి వెల్లడించారు.