పరీక్షకు ముందే ప్రశ్నపత్రం
– తూతూ మంత్రంగా ‘పది’ ప్రీఫైనల్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్ : నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు ప్రీఫైనల్ పరీక్షలకు సన్నద్ధమవుతూ కొంతమంది ఒక చోట కూర్చుని ప్రశ్నపత్రం పట్టుకుని జవాబులు వెతుకుతున్నారు. అనుమానం వచ్చిన టీచరు వారివద్దకు వెళ్లి చేతిలో ఉన్న ప్రశ్నపత్రాన్ని లాక్కున్నాడు. పరిశీలించగా అది గణితం (ఈ నెల 8న జరగాల్సిన పరీక్ష) పేపర్–2 ప్రశ్నపత్రం. గట్టిగా అడిగితే ఎవరో తమకు తెలిసిన వాళ్లు ఇచ్చారంటూ విద్యార్థులు చెప్పుకొచ్చారు. మొన్న జరిగిన అర్థ సంవత్సర పరీక్షల (సమ్మేటివ్ అసెస్మెంట్–2) నిర్వహణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రశ్నపత్రాలు జిరాక్స్ కేంద్రాలు, అంగళ్లలో లభించాయి. తాజాగా ప్రీపైనల్ పరీక్షల్లోనూ అదే పరిస్థితి. అన్ని ప్రశ్నపత్రాలు పరీక్షలకు ముందే లభిస్తున్నాయి.
రహస్యం లేని పరీక్షలు
తొలిసారి నిరంతర సమగ్ర మూల్యాంకం (సీసీఈ)∙విధానం అమలువుతుండడంతో అటు విద్యార్థులతో పాటు ఇటు ఉపాధ్యాయుల్లోనూ ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రీపైనల్ పరీక్షలు విద్యార్థుల సామర్థ్యాలు అంచనా వేసేందుకు చాలా ఉపయోగపతాయి. అయితే పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలు ఇలా బహిరంగంగా దొరుకుతుండడంతో ఆయా యాజమాన్యాలు, ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. విద్యార్థులు ఏయే సబ్జెక్టులో ఏమేరకు సామర్థ్యం ఉందో తెలుసుకునే వీలులేకుండా పోతోందని తల్లిదండ్రులు, యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రశ్నపత్రాల పంపిణీలో రహస్యమేదీ?
వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణ తేదీకి ముందే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాలు బండిళ్లు వారీగా ఆయా పాఠశాలలకు అందజేశారు. పాఠశాల యాజమాన్యం ఏ పరీక్ష రోజు ఆ పరీక్ష ప్రశ్నపత్రాల బండిల్ నేరుగా తరగతి గదిలో ఓపెన్ చేయాలి. అలాంటిది ముందే ఎవరో ఓపెన్ చేశారు. అవి విద్యార్థులకు ఎలా చేరాయన్నది అంతుచిక్కడం లేదు. ప్రశ్నపత్రం లీకైన విషయంపై డీఈఓ లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకెళ్లగా ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడుతున్నారోనని అసహనం వ్యక్తం చేశారు. విచారణ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.