పాఠ్యపుస్తకాలు రెడీ
సెలవులకు ముందే పంపిణీకి చర్యలు
జిల్లాకు చేరిన 21 శాతం పుస్తకాలు
వచ్చే నెల నుంచి మండల కేంద్రాలకు
బుక్ బ్యాంక్ నిర్వహించని హెచ్‌ఎంలపై చర్యలు: డీఈవో
సాక్షి, విశాఖపట్నం: పాఠ్యపుస్తకాల పంపిణీపై విద్యాశాఖ అప్రమత్తమైంది. సెలవులకు ముందే పూర్తి స్థాయిలో జిల్లా కేంద్రాలకే చేర్చేందుకు తొలి సారిగా కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగం గా ఇప్పటికే 21 శాతం పుస్తకాలను జిల్లాకు చేరవేసింది. మిగిలినవాటిని కూడా వీలైనంత వేగంగా జిల్లాలకు చేర్చి, భారం దించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చిన పాఠ్యపుస్తకాలను జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు చేరవేసేందుకు జిల్లా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. తరలింపునకు టెండర్లను ఆహ్వానించింది.
24.44 లక్షల పుస్తకాలు అవసరం
వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లాకు 24,44,325 పాఠ్యపుస్తకాలు అవసరం. గతేడాది పంపిణీకాగా మిగిలినవి(గ్రౌండ్ బ్యాలెన్స్) 63,997 పాఠ్యపుస్తకాలున్నాయి. నికరంగా 23,81,328 పుస్తకాలు రావాలి. ఇందులో ఇప్పటి వరకు సుమారు 5 లక్షలు జిల్లాకు చేరాయి. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు మినహా మిగిలిన జిల్లాలకు ఇప్పటికే 50 శాతం పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరాయి. ఈ నాలుగు జిల్లాలకు పంపిణీ బాధ్యతలు తీసుకున్న కాంట్రాక్టరు లారీల ఏర్పాటులో నిర్లిప్తత వల్లే కేటాయించిన సుమారు 13 లక్షల్లో కేవలం ఐదు లక్షలు మాత్రమే జిల్లాకు చేరినట్టు అధికారులు పేర్కొంటున్నారు. నిల్వ ఉన్న 8 లక్షలు వీలైనంత వేగంగా తరలించే అవకాశాలున్నట్టు అధికారులు చెబుతున్నారు.
టెన్త్ సిలబస్ మారింది
వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పాఠ్యపుస్తకాలు మారనున్నాయి. ఈమేరకు టెన్త్పాఠ్యపుస్తకాల ముద్రణ కూడా పూర్తయింది. కొన్ని టైటిల్స్ జిల్లాకు చేరాయి. ఇప్పటి వరకు తెలుగు మాధ్యమం విద్యార్థులకే పరిమితమైన పర్యావరణ విద్య, ఇక మీదట ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకూ తప్పనిసరి చేశారు. మారిన సిలబస్ మేరకు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకే ఈ ఏడాది ముందుగానే పాఠ్యపుస్తకాల పంపిణీ బాధ్యతల్ని చేపట్టినట్టు అధికారులు చెప్తున్నారు. వేసవిలో మారిన సిలబస్‌పై పూర్తి స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించేలా జిల్లా విద్యాశాఖకు ఇప్పటికే ఆదేశాలు కూడా వచ్చినట్టు తెలిసింది.
బుక్ బ్యాంక్ తప్పనిసరి
జిల్లాకు చేరిన పాఠ్యపుస్తకాలను మండల కేంద్రాలకు చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఏప్రిల్ నెలాఖరుకు వందశాతం పాఠ్యపుస్తకాల్ని మండలాలకు చేరవేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రధానోపాధ్యాయులంతా పైతరగతులకు ప్రమోట్ అయ్యే విద్యార్థుల పాఠ్యపుస్తకాలను స్వాధీనం చేసుకోవాలి. వాటిని కొత్తగా ఆ తరగతులకు వచ్చే విద్యార్థులకు అందజేయాలి. ఏ విద్యార్థీ పాఠ్యపుస్తకాల్లేకుండా తరగతులకు హాజరయ్యే దుస్థితి ఉండకూడదు. బుక్ బ్యాంక్ నిర్వహించని హెచ్‌ఎంలపై కఠిన చర్యలు తప్పవు.
- బి.లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి