బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ: అమిత్ షా
నల్లగొండ: భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఆయన సోమవారం జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం తెరట్పల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి బీజేపీ దివంగత నాయకుడు గుండగోని మైసయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు.
పార్టీ కోసం కార్యకర్త మైసయ్య ప్రాణాలు విడిచారని ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం గ్రామంలోని కొన్ని ఇళ్లకు వెళ్లిన అమిత్ షా ...అక్కడ స్థానికులతో మాట్లాడారు. ఆ తర్వాత అమిత్ షా బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. బూత్, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు ఒకే వేదికపైకి రావటం అరుదైన విషయమని అన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ బీజేపీకి 11కోట్ల మంది సభ్యులు ఉన్నారని, 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో కిందస్థాయిలోకి వెళ్లడం లేదని అమిత్ షా అన్నారు. తెరట్పల్లిలో స్వచ్ఛభారత్ జరగడం లేదని, మరుగుదొడ్లు లేవని అన్నారు. కేంద్ర పథకాలు కిందస్థాయికి చేరడం లేదనటానికి మరుగుదొడ్లు లేకపోవడమే నిదర్శనమన్నారు. తెలంగాణలోని బీజేపీ కార్యకర్త ఇంటింటికి వెళ్లి పార్టీ ఆశయాల గురించి వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి సాధించినట్లే తెలంగాణలో కూడా జరగాలని అన్నారు.
ప్రధాని మోదీ అందరి కోసం, అందరి అభివృద్ధి కోసం పని చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంన్న నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. సమావేశం అనంతరం అమిత్ షా ఎస్సీ కాలనీలో సహపంక్తి భోజనం చేశారు.