టర్మ్‌ప్లాన్‌తో మెరుగైన బీమా రక్షణ
జీవిత బీమా తీసుకోవడం అంటే.. తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా ఇవ్వడమే. అయితే, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను అచ్చమైన జీవిత బీమా అని చెప్పుకోవాలి. ‘‘టర్మ్ ప్లాన్ అయితే, తక్కువ ఖర్చు (ప్రీమియం)కు గరిష్ట బీమా కవరేజీనిస్తుంది. టర్మ్ ప్లాన్ ను ఇప్పుడు 99 ఏళ్లకు మించిన కాలానికీ తీసుకునే అవకాశం ఉంది. టర్మ్ ప్లాన్‌లో చెల్లించే ప్రీమియం వెనక్కి రాదని తెలిసిందే. పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు జీవించి ఉంటే కట్టిందంతా వ్యర్థమే అవుతుందన్న ఆలోచనతో కొంత మంది టర్మ్ ప్లాన్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో బీమా కంపెనీలు పాలసీ కాల వ్యవధి తీరే వరకు జీవించి ఉంటే కట్టిన ప్రీమియంను వెనక్కిచ్చే ఫీచర్‌తోనూ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. వీటి మధ్య సారూప్య, వ్యత్యాసాలను చూస్తే..
రెగ్యులర్ టర్మ్ ప్లాన్లు
అచ్చమైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ నిర్దేశిత కవరేజీతో, నిర్ణీత కాలానికి అందించేది. 5 నుంచి 45ఏళ్ల కాలానికి బీమా కవరేజీ లభిస్తుంది. పాలసీదారు పాలసీ కాల వ్యవధిలో మరణానికి గురైతే నామినీకి బీమా మొత్తాన్ని అందిస్తుంది. ఏకమొత్తంలో లేదా ఏటా నిర్ణీత శాతం చొప్పున ఎంచుకున్న ప్లాన్ ఆప్షన్ ఆధారంగా చెల్లింపులు ఉంటాయి. పాలసీ కాలవ్యవధి ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే ఎటువంటి ప్రయోజనాలు వెనక్కి రావు. పాలసీదారుకు జీవిత కాలం పాటు సంపూర్ణ కవరేజీ అన్నది ఇందులో లభిస్తుంది. కేవలం మరణానికి కవరేజీ మాత్రమే లభిస్తుంది. భరించగలిగే ప్రీమియంతో వచ్చే ప్లాన్ ఇదొక్కటే. ప్రీమియం అన్నది పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు స్థిరంగా (మార్పు లేకుండా) ఉంటుంది.
ప్రీమియం వెనక్కిచ్చే టర్మ్ ప్లాన్
దురదృష్టవశాత్తూ మరణానికి గురైతే తన కుటుంబానికి పరిహారం రావాలి. ఒకవేళ పాలసీ గడువు తీరే వరకు జీవించి ఉన్నా ఎంతో కొంత వెనక్కి రావాలని ఆలోచించే వారు చాలా మంది ఉన్నారు. రిటర్న్ ఆఫ్ ప్రీమియం (ఆర్వోపీ) టర్మ్ ప్లాన్లు ఈ కోవకు చెందినవే. వీటిల్లో గడువు తీరే వరకు పాలసీదారు జీవించి ఉంటే కట్టిన ప్రీమియం మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. పాలసీదారుకు హామీపూర్వక విలువను ఆఫర్ చేస్తుంది. పాలసీదారుగా మీ ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా పాలసీ కాల వ్యవధిని ఎంచుకోవచ్చు. తమకు ఎంతో కొంత వెనక్కి రావాలని ఆశించేవారికి ఆర్వోపీ టర్మ్ ప్లాన్ అన్నది విలువకు తగిన పాలసీ అవుతుంది.
సాధారణంగా 20, 25, 30, 40 ఏళ్ల టర్మ్ తో ఈ పాలసీలు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు మీరు 20 ఏళ్ల కాలవ్యవధిపై ఎంతో కొంత రుణం తీసుకుని ఉంటే, 20 ఏళ్ల టర్మ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. అనుకోని విధంగా మరణం చోటు చేసుకుంటే రుణం ఎలా చెల్లించాలన్న సమస్య ఉండదు. ఒకవేళ జీవించి ఉంటే చివర్లో నూరు శాతం ప్రీమియం వెనక్కి వచ్చేస్తుంది. కొన్ని ఆర్వోపీ ప్లాన్లు చెల్లించిన ప్రీమియానికి అధికంగానే వెనక్కి ఇస్తున్నాయి. ఇలా మెచ్యూరిటీ తర్వాత అందుకునే మొత్తంపై పన్ను ఉండదు. బీమా ప్రీమియం చెల్లింపు సమయంలోనూ ఆ మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది.
ప్రీమియం చెల్లింపులు
మీ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రీమియం చెల్లింపు విధానాన్ని ఎంచుకోవచ్చు. సాధారణంగా అయితే వార్షికంగా, అర్ధ సంవత్సరానికి, త్రైమాసికం, నెలవారీగా చెల్లించే ఆప్షన్లు ఉంటాయి. కొన్ని సింగిల్ (ఒక్కసారి చెల్లించే) ప్రీమియం ఆప్షన్ తోనూ వస్తున్నాయి.
సంతోష్ అగర్వాల్
చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పాలసీబజార్ డాట్ కామ్
లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం