రోగి చికిత్స ఆపినా.. ఇన్సూరెన్స్ క్లెయిమ్!
చంఢీఘర్: వైద్యం పని చేయదనే డాక్టర్ల సలహా మేరకు చికిత్స ఆపేవేసి మరణించే రోగులకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. రోగి చికిత్స చేయించుకోకుండా మరణిస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదంటూ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం వైద్యం ఆపివేసిన తర్వాత మరణించే రోగులకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో దశాబ్దాలుగా ట్రీట్ మెంట్ మానేసిన రోగులకు మరణానంతరం ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు ఇవ్వకుండా ఉంటున్న కంపెనీల ఆటలు ఇక సాగవని వైద్య రంగ నిపుణులు చెప్తున్నారు.
చికిత్స తీసుకోకపోవడం రోగికి ఇష్టం లేక కాదని, శారీరక స్థితి సహకరించకపోవడం వ్యక్తి తప్పుకాదని కోర్టు వ్యాఖ్యనించింది. ఇటువంటి కేసుల్లో కంపెనీలు కచ్చితంగా బాధితునికి ఇన్సూరెన్స్ చెల్లించాలని కోర్టు తేల్చి చెప్పింది. మతపరమైన నమ్మకాలు ఉండటం వల్ల కొంతమంది రోగులు(రక్త మార్పిడి తదితరాలు) చికిత్సకు అంగీకరించటం లేదని దీనిపై ప్రజలు మరోసారి ఆలోచించుకోవాలని జస్టిస్ కన్నన్ అన్నారు. చండీఘర్ కు చెందిన బ్యాంకు ఉద్యోగి మరణానంతరం ఇన్సూరెన్స్ క్లెయిమ్ పై జరిగిన వాదనల్లో బాధిత కుటుంబానికి రూ.35.46లక్షల పరిహారాన్ని ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది.