అమెరికాలోనూ ఇస్తాంబుల్ తరహా దాడులు?
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ టర్కీ రాజధాని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో చేసినట్లుగానే అమెరికాలో కూడా దాడులు చేయొచ్చని అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ జాన్ బ్రెనన్ హెచ్చరించారు. ఐఎస్ సామర్థ్యం ఏంటో పరిశీలించే నిఘా వృత్తిలో ఉన్న వ్యక్తిగా తాను చాలా ఆందోళన చెందుతున్నానని, వాళ్లు వీలైనంత ఎక్కువ మందిని చంపాలన్న కృతనిశ్చయంతో ఉన్నారని, ప్రధానంతా విదేశాలలోనే దాడులు చేయాలనుకుంటున్నారని బ్రెనన్ తెలిపారు.
ఇస్తాంబుల్ తరహాలోనే అమెరికాలో కూడా దాడులు చేయాలని ఐఎస్ ప్రయత్నిస్తోందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. నిజానికి ఇస్తాంబుల్లో ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని ఆ దేశ నిఘా వర్గాలు 20 రోజుల ముందే హెచ్చరించాయి. ఆ లేఖలో అటాటర్క్ విమానాశ్రయం మీద దాడి జరగొచ్చని కూడా ఉందట. ఇప్పటివరకు ఆ దాడి చేసింది తామేనని ఎవరూ ప్రకటించుకోకపోయినా.. ఆత్మాహుతి దాడులు జరిగిన పద్ధతి చూస్తుంటే మాత్రం అది ఐఎస్ వాళ్ల పనేనని బ్రెనన్ అనుమానం వ్యక్తం చేశారు.