ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండా అరెస్టు
న్యూఢిల్లీ : లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అబ్దుల్ కరీం తుండా (70)ను ఢిల్లీ ప్రత్యేక పోలీసులు అరెస్టు చేశారు. ఇండో- నేపాల్ సరిహద్దుల్లో సంచరిస్తుండగా అతన్ని గత రాత్రి అరెస్ట్ చేసినట్లు న్యూఢిల్లీ స్పెషల్ సెల్ ప్రత్యేక కమిషనర్ శ్రీవాత్సవ వెల్లడించారు. ఈ రోజు ఉదయం తుండాను ఢిల్లీ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు తుండా అత్యంత సన్నిహితుడని, అలాగే పాక్‌లోని ఐఎస్ఐ సంస్థతో కూడా అతడికి సన్నిహిత సంబంధాలున్నాయని శ్రీవాత్సవ వివరించారు.
ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లో జరిగిన 40 బాంబు పేలుళ్ల ఘటనలతో తుండాకు సంబంధాలున్నాయని చెప్పారు. ముంబై దాడి కేసులో ఇతను కూడా నిందితుడే అని ఆయన స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం పాకిస్థాన్ ప్రభుత్వానికి అందజేసిన 20 మంది ఉగ్రవాదుల జాబితాలో తుండా పేరు కూడా ఉందని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆత్యాధునాతన పేలుడు పదార్థాలను తయారు చేయడంపాటు.. వాటిని పేల్చడంలో కూడా తుండా నిపుణుడని పోలీసుఉన్నతాధికారి శ్రీవాత్సవ తెలిపారు.