డిఫరెంట్ అలర్ట్
కొత్త సినిమా గురూ!
మామూలుగా ఉగ్రవాద నేపథ్యంలో సినిమాలంటే చాలా సీరియస్‌గా ఉంటాయి. ఫన్‌కి స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. ఆ ఫార్ములాను బ్రేక్ చేస్తూ రూపొందిన చిత్రం ‘రెడ్ అలర్ట్’. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చంద్రమహేశ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి నిర్మాత పీవీ శ్రీరామ్‌రెడ్డి. ఆయన తనయుడు హెచ్.హెచ్.మహదేవ్ హీరోగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ ఏంటంటే... హైదరాబాద్‌లో ఘనంగా జరిగే గణేశ్ నిమజ్జనం చూడటానికి పల్లెటూరి నుంచి మహదేవ్, శివ, రామకృష్ణ, శీను సిటీకి వస్తారు. సిటీలో ఓ చాన ల్లో క్రైం రిపోర్టర్‌గా పనిచేస్తున్న బెస్ట్ ఫ్రెండ్ శ్రీరామ్ పిలవడంతో ఈ నలుగురూ భాగ్యనగరంలోకి అడుగుపెడతారు. గణేశ్ నిమజ్జనం జోరుగా జరుగుతున్న సమయంలో నగరాన్ని అల్లకల్లోలం చేయాలని ఓ నలుగురు తీవ్రవాదులు ప్లాన్ చేస్తుంటారు. ఇది తెలుసుకుని నగరంలో పోలీస్ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటిస్తుంది. తీవ్రవాదులను ఏరిపారేయడానికి హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ భువనేశ్వరి చార్జ్ తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో నగరం చూడ్డానికి వచ్చిన నలుగురు కుర్రాళ్లకూ పూనా వెళుతున్నానంటూ శ్రీరామ్ నుంచి మెసేజ్ అందుతుంది. దాంతో ఓ హోటల్లో దిగుతారు. వాళ్లకు ఓ చోట డబ్బుల మూట దొరుకుతుంది. లైఫ్ టర్న్ అయిందని సంబర పడిపోయి ఆ మూటను హోటల్ గదికి తీసుకువస్తారు. పూర్తిగా తెరిచి చూస్తే, అందులో తల లేని మొండం దొరుకుతుంది. కట్ చేస్తే వీళ్లు ప్రయాణం చేసిన క్యాబ్ డ్రైవర్‌కు ఓ తల దొరుకుతుంది. ఇంతకూ ఆ శవం ఎవరిది? ఎవరు చంపారు? శ్రీరామ్ ఏమైపోయాడు? అనేది మిగతా కథ.
హీరోయిన్ లేకుండానే.... ‘ప్రేయసి రావె’ వంటి విజయవంతమైన చిత్రంతో దర్శకునిగా పరిచయమై, శ్రీహరితో ‘అయోధ్య రామయ్య’, ‘హనుమంతు’ చిత్రాలతో తనలో మంచి దర్శకుడు ఉన్నాడని నిరూపించుకున్నారు. ఈసారి టెర్రిరిజమ్ నేపథ్యంలో కథను అల్లుకుని ఈ సినిమా తీశారు. సుమన్, పోసాని కృష్ణమురళి, జోగీ బ్రదర్స్‌ను మినహాయిస్తే ఈ చిత్రంలో నటీనటులందరూ కొత్తవాళ్లే. అనుకున్న కథను ఎక్కడా డైవర్ట్ కాకుండా పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించడం ఈ చిత్రానికి ప్లస్ అయింది. అలీ, పోసాని కృష్ణమురళిల కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. ఓ శవం తాలూకు తల, మొండం ఒకసారి పోసానికి, మరోసారి అలీకి, ఇంకోసారి హీరో ఫ్రెండ్స్ బ్యాచ్‌కు దొరికే సన్నివేశాలు కాస్త ఉత్కంఠ కలిగిస్తూ, ప్రథమార్ధం అంతా ఓ థ్రిల్లర్‌లా సాగిపోతుంది. మొండాన్ని వదిలించేసుకోవాలని ఇంకో సూట్‌కేసులోకి మారుస్తున్నప్పుడు స్పష్టంగా వేలాడుతున్న ఐడీ కార్డ్‌ను హీరో బ్యాచ్ చూడకపోవడం, అలాగే వెస్ట్ జోన్ డీసీపీ స్థాయిలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఓ క్రిమినల్‌ను పట్టుకోవడానికి బార్లో ఐటెమ్ గాళ్ అవతారం ఎత్తడం ఇవన్నీ లాజిక్కు అందని అంశాలుగా చెప్పొచ్చు. కొత్తవాళ్లతో బ్రహ్మాండాలు తీసే అవకాశం ఉండదు కాబట్టి, చంద్రమహేశ్ సేఫ్ జోన్లో వెళ్లారని పిస్తుంది. నటీనటుల నుంచి మంచి నటన రాబట్టు కున్నారు. ముఖ్యంగా హీరోగా నటించిన మహదేవ్‌కు ఇది మొదటి సినిమా అయినా బాగానే చేశారు.
హైలైట్స్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన తొలి చిత్రమిదే ‘జై జై గణేశా...’ అంటూ ఓ సంస్కృత గీతాన్ని శంకర్మహదేవన్తో పాడించారు. ఆ పాట సినిమా క్లైమాక్స్‌లో వస్తుంది.