నాణ్యత నీటిమీద రాతే
♦ నీటి పరీక్షలు నామమాత్రం
♦ గ్రామాల్లో అడుగంటుతున్న నీరు
♦ తక్షణ పరీక్షలు అనివార్యం
♦ వర్షాకాలంలో తప్పని తిప్పలు
వైరా : భూగర్భ జలాలు అడుగంటాయి. తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. చాలా గ్రామాల్లో బోర్లు, నల్లాలు పనిచేయడం లేదు. జిల్లావ్యాప్తంగా ఫ్లోరైడ్ ప్రభావం అధికంగా ఉంది. తాగునీటి పథకాల నుంచి శుద్ధి చేసిన జలాలు అందడం లేదు. కలుషిత నీరు తాగి గ్రామాల్లో డయేరియా వ్యాప్తిచెందిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఫలితమివ్వని పరీక్ష
గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛమైన నీటిని అందించాలన్న ఉద్దేశంతో క్షేత్ర పరీక్ష కిట్టు(ఎప్టీకే)ను ఇచ్చారు. పల్లెల్లో నీటి పరీక్ష చేయడానికి 2013లో ప్రతి గ్రామ పంచాయతీకి నీటికిట్టు ఇచ్చారు. ఒక్కో దానికోసం రూ.2,500 నుంచి రూ.3వేల వరకు వెచ్చించారు. నీటి పరీక్షలు ఎలా చేయాలనే విషయంపై సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం కిట్లు దుమ్ము, ధూళి పట్టి బీరువాల్లో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.
మంచినీరు ఇలా ఉండాలి
బురద లేని నీటిని సరఫరా చేయాలి. ఉదజని సూచిక 6 నుంచి 8.5 వరకు ఉండాలి. క్షార గుణ సాంద్రత 300 నుంచి 600 వరకు ఉండాలి. క్లోరైడ్ 250 నుంచి 1000 వరకు ఉండాలి. ఫ్లోరైడ్ (0-1.5) మించి ఉండకూడదు. నైట్రేట్(నత్రజని) 0-45 ఉండాలి. ఇనుము 0-3 ఉండాలి. క్లోరిన్ 0 నుండి 0.02 ఉండాలి. వీటిలో ఏది లోపించినా ఆ నీరు తాగడానికి పనికి రాదని అధికారులు చెబుతున్నారు.
అడుగంటేకొద్దీ అనర్థాలే..
గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటేకొద్దీ అనర్థాలే ముంచుకొస్తాయి. ప్రతి వారం నీటి పరీక్షలు చేస్తున్నప్పుడే ఈ ఫలితాలు తెలుస్తాయి. సహజంగా వర్షాకాలం ఫ్లోరిన్ శాతం తక్కువగా నమోదవుతుంది. వేసవి ప్రవేశించినప్పుడు భూగర్భ జలాలు తగ్గిపోతాయి. ఈ సమయంలో నీటి గాఢత, ఆల్కోనాటి, ఫ్లోరిన్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆర్డబ్ల్యూఎస్ నీటి నాణ్యత విభాగం అధికారులు అంటున్నారు.
గ్రామాల్లో కనీసం మంచినీటి ట్యాంకుల క్లోరినేషన్ జరగాలి. దీనికి సంబంధించి రేసిడైల్ క్లోరిన్ టెస్ట్ ఉంటుంది. పంచాయతీ స్థాయిలో ఈ పరీక్షలు చేస్తే కనీసం జనం రోగాల బారిన పడకుండా ఉంటారని అధికారులు చెబుతున్నారు.
అయితే ఈ పరీక్షలే గ్రామాల్లో కరువయ్యాయి. పైపుల లీకేజీ, మురుగునీరు పైపుల్లోకి రావటంపై నిరోధక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం కోనసాగుతుంది. దీంతో డయేరియా విజృంభిస్తోంది. నీటి స్వచ్ఛత, మినరల్స్ లోపం ప్రభావం కిడ్నీలపైనా ఉంటోందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇలా ఉంది తీరు
నీటి కిట్ల ఉపయోగంపై గ్రామీణ నీటి సరఫరా విభాగం వారు ఆరేళ్ల క్రితం సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శలు శిక్షణ ఇచ్చారు. వారి చేతికే నీటి కిట్లను అందజేశారు. ప్రస్తుతం కిట్లతో పరీక్షలు జరగకపోగా.. వాటి జాడ కూడా తెలియడం లేదు. జిల్లాలో ఎక్కడా వీటి వినియోగం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామీణ తాగునీటి సరఫరాలో నీటి నాణ్యతను పరీక్షించి శుద్ధ జలాన్ని అందించాలని ప్రజలు కోరుతున్నారు.